Andhra University : ప్రసాదరెడ్డి ఇష్టారాజ్యం!
ABN , Publish Date - Dec 18 , 2024 | 03:10 AM
ప్రతిష్ఠాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) గాడిలో పెడుతున్నానని అనేకసార్లు ప్రకటించుకున్న మాజీ వైస్ చాన్సలర్(వీసీ) ప్రసాదరెడ్డి సరిదిద్దుకోలేని తప్పులు చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠను
ఏయూలో అడ్డగోలు నియామకాలు
50 మందికిపైగా గెస్టు ప్రొఫెసర్లు
ఒక్కొక్కరికీ నెలకు రూ.80 వేల జీతం
అస్మదీయులకు పీహెచ్‌డీ ప్రవేశాలు
ఇంటర్ సర్టిఫికెట్లు సైతం జారీ
మాజీ వీసీ దారుణాలు ఎన్నెన్నో
ఉన్నత విద్యాసంస్థ పరువు తీసిన వైసీపీ బంటు
విచారణకు విద్యావంతుల డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రతిష్ఠాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) గాడిలో పెడుతున్నానని అనేకసార్లు ప్రకటించుకున్న మాజీ వైస్ చాన్సలర్(వీసీ) ప్రసాదరెడ్డి సరిదిద్దుకోలేని తప్పులు చేసి యూనివర్సిటీ ప్రతిష్ఠను మసకబార్చారని మేధావులు, విద్యావంతులు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి అప్రకటిత నేతగా వ్యవహరించి, ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం, వీసీగా అదే కుర్చీలో కొనసాగడానికి వర్సిటీని ఏకంగా పార్టీ కార్యాలయంగా మార్చేశారు. పద్ధతి ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రొఫెసర్ల నియామకాన్ని ఆయనకు నచ్చినట్టు చేశారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారిని తీసుకొచ్చి గెస్ట్ ప్రొఫెసర్లుగా నియమించారు. మరికొందరికి ‘చైర్ ప్రొఫెసర్’ అంటూ పెద్దపీట వేశారు. ఇలా 50మందికి పైగా అస్మదీయులను తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. అంతా తన కనుసన్నల్లో జరిగేలా చేసుకున్నారు. ఇదే వర్సిటీలో పనిచేస్తున్నవారికి పదోన్నతులు ఇవ్వకుండా పక్కనపెట్టి, బయటనుంచి వచ్చిన వారి ఆదేశాల ప్రకారం పనిచేయాలని హుకుం జారీ చేశారు. వ్యతిరేకించిన వారిని వేధించారు. వారి సర్వీస్ రికార్డులను రిమార్కులతో నింపేశారు. వర్సిటీలో పీహెచ్‌డీలు చేసి ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్నవారికి అవకాశాలు లేకుండా చేశారు. ఆయనతో పాటు బయట నుంచి వచ్చినవారు భారీగా జేబులు నింపుకొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా కూటమి ప్రభుత్వం ప్రసాదరెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టకపోవడాన్ని విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా నిరసిస్తున్నారు.
లక్ష్మీపార్వతితో మొదలు
వైసీపీకి చెందిన లక్ష్మీపార్వతిని తెలుగు విభాగంలో గెస్ట్ ప్రొఫెసర్‌గా నియమించారు. గైడ్‌గా ప్రకటించి పది మంది పీహెచ్‌డీ విద్యార్థులను అప్పగించిన విషయం ప్రసాదరెడ్డి కుర్చీ దిగిన తర్వాత గానీ బయటకు రాలేదు. తన అడ్డగోలు నియామకాల విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నేవీలో పనిచేశానని చెప్పుకొంటున్న ఓ అధికారికి ప్రసాదరెడ్డి ఏయూ డిఫెన్స్ స్టడీ సెంటర్‌లో సలహాదారు సహా గెస్ట్ ప్రొఫెసర్ పోస్టు కట్టబెట్టారు. ఆయన చెప్పినవారందరికీ పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చారు. ఆయన తన భార్యకు కూడా హిందీ విభాగంలో పీహెచ్‌డీ సీటు ఇప్పించుకున్నారు. వివిధ డిఫెన్స్ సంస్థల పేర్లతో లేఖలుతెచ్చి, నచ్చిన కోర్సులో ప్రవేశాలు కల్పించి సర్టిఫికెట్లు జారీ చేయించారు. విభాగాధిపతులతో సంబంధం లేకుండా ప్రసాదరెడ్డికే ఈ-మెయిల్స్ పెట్టి సదరు అధికారి తన పనులు చేయించుకునేవారు. పదో తరగతి పాసైనవారికి బీఏ ఆనర్స్ పేరుతో ఇంటర్మీడియెట్ సహా ఐదేళ్ల కోర్సు సర్టిఫికెట్లు భారీసంఖ్యలో జారీ చేశారు. ఆ మాజీ నేవీ అధికారి హయాంలో ప్రవేశపెట్టిన కోర్సులకు బోర్డు ఆఫ్ స్టడీస్ ఆమోదం కానీ, సెనేట్ గ్రీన్‌సిగ్నల్ కానీ లేవని గుర్తించి వాటిని నిలుపుచేశారు. ప్రసాదరెడ్డి దిగిపోయిన తర్వాత.. అక్టోబరు నుంచి ఆ మాజీ నేవీ అధికారి సేవలను నిలిపివేసి, ఆయన గదికి తాళం వేశారు.
ఇంజనీరింగ్ విభాగంలో
కేంద్ర సంస్థలో పనిచేసి రిటైరైన లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని ఇంజనీరింగ్ కాలేజీ ఓఎ్‌సడీగా నియమించారు. ఆయన కాలేజీ ప్రిన్సిపాల్‌ను, విభాగాధిపతిని ధిక్కరించి నిర్ణయాలు తీసుకునేవారు. ఎప్పుడూ ప్రసాదరెడ్డి చాంబర్‌లోనే ఉండేవారు. ఆయన్ను ఇటీవల తప్పించినా ఇంకా అక్కడే తిరుగాడుతున్నారు. ఇంటర్మీడియెట్ విద్యాసంస్థలు నడిపే ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న రాంజీ అనే వ్యక్తిని గెస్టు ప్రొఫెసర్‌గా నియమించారు. ప్రసాదరెడ్డి వెళ్లిపోయినా ఆయన ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న చంద్రశేఖర్, శ్రీనివాస్, త్రినాథరావుకు కీలక పోస్టులు ఇచ్చి, ఒక్కొక్కరికీ రూ.80వేల నుంచి రూ.లక్ష జీతంగా చెల్లించారు. వీరంతా వర్సిటీ బోధనా సిబ్బందిపై అజమాయిషీ చేస్తుంటారని తెలిసింది.
పాస్టర్‌కు పగ్గాలు
ప్రైవేటు కళాశాల ప్రిన్సిపాల్ కమ్ పాస్టర్‌ను తీసుకువచ్చిన వీసీ ప్రసాదరెడ్డి.. ఆయనను చైర్ ప్రొఫెసర్‌ను చేశారు. ఆ తర్వాత ఏకంగా రిజిస్ట్రార్‌గా నియమించారు. ప్రసాదరెడ్డి దిగిపోయాక ఇంజనీరింగ్ విభాగంలో ఏఐ బోధించడానికి డ్యూటీ వేశారు. ఆ తర్వాత పదవి పోవడంతో సాధారణ ప్రొఫెసర్‌గా ఇంజనీరింగ్ పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేయకుండా తన వద్దకే ఆ పుస్తకాన్ని తెప్పించుకొనేవారు. అంతా ఉదయం 9 గంటలకు వస్తే ఆయన 11 గంటలు దాటిన తర్వాత వచ్చేవారు. ఇవన్నీ ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వర్సిటీ పరువును మంటగలిపిన ప్రసాదరెడ్డిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, ఏయూ పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.