CPI Narayana: ‘వైఎస్ఆర్ ఉండుంటే.. రేవంత్ ఇక్కడికి వచ్చేవాడు కాదు’
ABN , Publish Date - Jul 08 , 2024 | 06:52 PM
దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అమరావతి, జులై 08: దివంగత ముఖ్యమంత్రి డాక్ట్రర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తగిన తనయా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కితాబు ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఆమె ఇలా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలన్న తర్వాత అనేక కష్టాలు, ఇబ్బందులుంటాయని.. వాటిని ఎదుర్కొని నిలబడాలంటూ ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు ధైర్య వచనాలు చెప్పారు.
జులై 8వ తేదీ వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్బంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రోజు వైఎస్ఆర్ జయంతి వేడుక కార్యక్రమాన్ని భారీ ఎత్తున వైయస్ షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత కె. నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి నిగర్వి అని అన్నారు. విమర్శలను సైతం ఆహ్వానించే తత్వం అయినదని తెలిపారు. వైఎస్ఆర్ నిత్యం పంచె కట్టులో ఉండేవారన్నారు. ఓసారి పంచె కట్టు గురించి అడిగితే.. ఆయన నవ్వుతూ.. నాకు సంప్రదాయమంటూ వైఎస్ఆర్ సమాధానం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.
Also Read: Anant-Radhika wedding: పెళ్లి సందడి.. ఆకాశాన్నంటిన హోటల్ రూమ్ ధరలు !
Also Read: Jharkhand: విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం.. కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
అయితే రాజకీయాల్లో తాను, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సమకాలీకులమన్నారు. నాటి నుంచి తమ మధ్య ఛలోక్తులు, సరదా సంభాషణలుండేవని తెలిపారు. పేదలు కష్టం కానీ వస్తే.. వారికి సాయం చేయకుండా వెనక్కి పంపే వారు కాదని వైఎస్ఆర్‌లోని సహజ గుణాన్ని ఈ సందర్బంగా కె.నారాయణ వివరించారు. అయితే వైఎస్ఆర్ మరణంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందంటూ కుండ బద్దలు కొట్టారు. వైఎస్ఆర్ ఉండి ఉంటే.. నేడు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇక్కడకు వచ్చేవాడే కాదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీ సైతం ఉండేది కాదన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అందరం కలిసి ఉండేవాళ్లమని చెప్పారు. వైఎస్ఆర్, తాను ఎప్పుడైనా ఎదురుపడితే.. తన విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని.. వాటి గురించి అడిగేవారన్నారు. అలాగే తమ మధ్య ఎప్పుడూ రాజకీయంగా విబేధాలే కానీ.. వ్యక్తిగతంగా తామంతా బాగానే ఉండేవాళ్లమన్నారు. ఇక వైఎస్ఆర్ ఎన్నో కష్టాలు పడి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వివరించారు.
Also Read: Mumbai: పలు విమాన సర్వీసులు దారి మళ్లింపు
Also Read: Viral Video: ‘టైగర్’ పుట్టిన రోజు.. సరిత ఏం చేసిందంటే..?
అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్పటి నేతలు చాలా మంది వైఎస్ఆర్‌ను పలు రకాలుగా ఇబ్బందులు గురి చేశారన్నారు. ఈ రోజు జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు వివిధ పార్టీల నేతలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అంచలంచలుగా ఎదిగిన తీరు, ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన పథకాలు, తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్బంగా పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన ఈ జయంతి కార్యక్రమానికి వైసీపీలోని కీలక నేతలంతా దూరంగా ఉన్నారు.
Read Latest News And National News