Visakhapatnam : తుఫాను గండం..!
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:49 AM
కోస్తాంధ్రకు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం
నేటికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
28వ తేదీ నాటికి తుఫాన్‌గా మారొచ్చని అంచనా
శ్రీలంక వద్ద తీరం దాటి మళ్లీ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశం
29 లేదా 30న చెన్నై సమీపంలో తీరం దాటే చాన్స్
నేటి నుంచి నెలాఖరు వరకూ వర్షసూచన
వరి రైతులు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్రకు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించింది. సోమవారం మధ్యాహ్నానికి తమిళనాడులోని నాగపట్నానికి 810 కి.మీ. ఆగ్నేయంగా, చెన్నైకు 1,000 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా వస్తుందని, ఈ క్రమంలో 28 నాటికి తుఫాన్‌గా మారుతుందని కొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తుఫాన్‌గా శ్రీలంక వద్ద తీరం దాటి తిరిగి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనంతరం ఉత్తరంగా పయనించి వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ తెల్లవారుజామున చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని పేర్కొంటున్నారు. ఐరోపాకు చెందిన మోడల్, భారత వాతావరణ శాఖకు చెందిన మోడల్, మరో మోడల్ అంచనా మేరకు తీవ్ర వాయుగుండం/వాయుగుండం చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. అయితే తీరం దాటే పాయింట్ ఎక్కడ, ఏ సమయంలో.. అన్నదానిపై స్పష్టత లేదు.
ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించాయి. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమవారం ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుంది. ఈ నెల 27, 28 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురుస్తాయి. 29న కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ నెల 30, డిసెంబరు ఒకటో తేదీన కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో కోస్తాంధ్రలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళ, బుధ వారాల్లో దక్షిణకోస్తా తీరంలో గంటకు 50 నుంచి 75 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మంగళవారం తర్వాత వరి కోతలు నిలిపివేయాలని సూచించింది. కోసిన, నూర్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని కోరింది. ఉద్యాన తోటల్లో చెట్లు పడిపోకుండా బాదులతో ఊతం అందించాలని, పల్లపు పొలాల్లో నీరు నిలబడకుండా వాతులు చేసుకోవాలని సూచించింది.