Pawan Kalyan: ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇలానే అభివృద్ధి చెందాయి..
ABN , Publish Date - Nov 25 , 2024 | 05:34 PM
ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం ఇలానే అభివృద్ధి చెందాయన్నారు.
అమరావతి: టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ, పర్యటక, ఆర్. అండ్ బి. శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వివరించారు.
అవకాశాలు పుష్కలం..
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని.. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామని వివరించారు.