Share News

స్వచ్ఛ గ్రామాలు అందరి బాధ్యత

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:13 AM

గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

స్వచ్ఛ గ్రామాలు అందరి బాధ్యత

  • డంపింగ్‌ యార్డుల సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తాం

  • గ్రామాల్లో యార్డుల ఏర్పాటు, నిర్వహణపై త్వరలోనే కొత్త విధానం

  • శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెల్లడి

అమరావతి, నవంబరు19(ఆంధ్రజ్యోతి): గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, నిర్వహణలపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించామని, ఆ సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. వాటి నిర్వహణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భూమి అందుబాటులో లేని నేపథ్యంలో 10 నుంచి 15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2015 నుంచి ఉపాధి హామీ పథకానికి అనుగుణంగా 10,808 గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులను చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు (ఎస్‌డబ్ల్యూపీసీ)గా అభివృద్ధి చేశామన్నారు. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీల్లో ఈ కేంద్రాలు లేవని చెప్పారు. ఎస్‌డబ్ల్యూపీసీలు లేని పంచాయతీల్లో 2025-26లో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో 9,382 పని చేస్తున్నాయన్నారు. వీటిల్లో పాక్షికంగా పనిచేస్తున్న 3826 ఎస్‌డబ్ల్యూపీసీలను మార్చి 2025 నాటికి పూర్తిగా పని చేసే స్థితికి అప్‌గ్రేడ్‌ చేస్తామని, పూర్తిగా పనిచేయని 1,426 ఎస్‌డబ్ల్యూపీసీలను పని చేసే స్థితికి తీసుకొస్తామని వివరించారు.


ఏపీ మార్క్‌ఫెడ్‌ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్‌ విక్రయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. పీఆర్‌ వన్‌ యాప్‌ ద్వారా ఎస్‌డబ్ల్యూపీసీల స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. కాగా, గ్రామ సచివాలయ భవనాల రంగులకు 2019-24 మధ్య వైసీపీ హయాంలో రూ. 101.81 కోట్లు ఖర్చు అయ్యిందని పవన్‌ చెప్పారు. రంగులు వేయడానికి రూ. 49.8 కోట్లు, వాటిని తొలగించి తిరిగి సాధారణ రంగులు వేయడానికి రూ. 52.73 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని వెల్లడించారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని కార్యాలయాలకు మాత్రమే అయిన ఖర్చు ఇది అని స్పష్టం చేశారు. మిగిలిన కార్యాలయాలకు అయిన ఖర్చును సంబంధిత శాఖలు అందజేస్తాయని సభ్యుల ప్రశ్నకు సమాధానం చెప్పారు.

  • 5 బిల్లులకు మండలి ఆమోదం..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 ఏపీ పంచాయతీరాజ్‌ (సవరణ) బిల్లు-2024, ఏపీ పురపాలక శాసనముల(సవరణ) బిల్లు) -2024, ఎన్టీఆర్‌ ఆరోగ్య, విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయాల(సవరణ) బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్‌ ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ(సవరణ) బిల్లు- 2024, ఆంధ్రప్రదేశ్‌ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ(సవరణ) బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.

Updated Date - Nov 20 , 2024 | 05:14 AM