Share News

Chittoor : పోస్టు నుంచి లేపేస్తాం!

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:32 AM

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలోని 982 ఎకరాల ఎస్టేట్‌ భూములపై 1970 నుంచీ వివాదం నడుస్తోంది. దీన్ని పట్టా భూమిగా పేర్కొం టూ ఇచ్చిన ఉత్తర్వులను అనేక దశల్లో అధికారులు కొట్టివేస్తూ వచ్చారు.

Chittoor : పోస్టు నుంచి లేపేస్తాం!

  • మరెక్కడా పోస్టింగు రాకుండా చేస్తాం

  • పెద్దాయన ఫోన్‌చేసినా వినవా?

  • సర్వే-సెటిల్‌మెంట్‌ కమిషనర్‌కు

  • పెద్దిరెడ్డి మనుషుల బెదిరింపులు

  • అయినా లొంగని సిద్ధార్థ్‌ జైన్‌

  • రాగానిపల్లె భూమి కేసులో కొత్తకోణం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విలువైన భూమిపై కన్నేసిన జగన్‌ ప్రభుత్వ పెద్దలు దాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. తామేం చెప్పినా చేయాలని, ఎక్కడ అంటే అక్కడ సంతకం పెట్టాలని అధికారులను బెదిరించారు. మాట వినని వారిపై అసమర్థులు, టీడీపీ కోవర్టులన్న ముద్రవేసి పోస్టుల నుంచి తప్పించారు. మాట వినే వారిని తెచ్చుకుని భూములు స్వాహా చేశారు. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో భూదోపిడీకి పెద్దలు ప్రయోగించిన మంత్రాంగం ఇదీ. అచ్చం ఇలాగే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లె ఎస్టేట్‌ భూముల విషయంలో నాటి మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు రెవెన్యూ, సర్వే అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించారు. మాట వినని తహశీల్దార్‌, సర్వేయర్‌, ఆర్డీవోలపై దాడులకు తెగబడ్డారు. సీనియర్‌ ఐఏఎ్‌సలను సైతం తీవ్రంగా బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలోని 982 ఎకరాల ఎస్టేట్‌ భూములపై 1970 నుంచీ వివాదం నడుస్తోంది. దీన్ని పట్టా భూమిగా పేర్కొం టూ ఇచ్చిన ఉత్తర్వులను అనేక దశల్లో అధికారులు కొట్టివేస్తూ వచ్చారు. చివరకు కొందరు 2006లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సర్వే-సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. అందరికీ నోటీసులిచ్చి వారి వాదనలు వినాలని, పుంగనూరు తహశీల్దార్‌ వాదన కూడా వినాలని కోర్టు చెప్పింది. అయితే ఆ తర్వాత 2022 వరకు ఈ భూమిపై ఎలాంటి పురోగతి లేదు. దీనిపై చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కన్నేసిన తర్వాతే కదలిక వచ్చింది. ఎలాగూ సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌నే కేసు సెటిల్‌ చేయాలని కోర్టు చెప్పినందున.. నాటి కమిషనర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ జైన్‌ను ముగ్గులోకి దించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు పొందాలని భావించారు.

పెద్దిరెడ్డి మనుషులు పలుమార్లు ప్రభుత్వ పెద్దల ద్వారా ఆయనపై ఒత్తిడి తెచ్చారు. నేరుగా పెద్దిరెడ్డి కూడా మూడుసార్లు ఫోన్‌చేసి సానుకూల ఉత్తర్వులు ఇవ్వాలంటూ జైన్‌ను ఆదేశించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు కోరినట్లుగా ఉత్తర్వులిస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయన గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈ భూమి గురించిన పూర్తి వివరాలూ తెలుసు. గతంలో చిత్తూరు జేసీగా ఉన్న ఓ ఐఏఎస్‌ అధికారి ఇనాం, ఎస్టేట్‌ భూములను అడ్డగోలు ఉత్తర్వులతో పరాధీనం చేస్తే కలెక్టర్‌ హోదాలో జైన్‌ సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ వద్ద అప్పీల్‌ చేయించి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయించారు. తర్వాత ఆ కేసులపై విచారణ జరుగగా.. సంబంధిత అధికారిపై సర్కారు చర్యలు తీసుకుంది.


ఈ అనుభవం ఉన్న జైన్‌ రాగానపల్లె కేసు వివరాలను అధ్యయనం చేశాక ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఫైలును పక్కనబెట్టారు. దీంతో పెద్దిరెడ్డి మనుషులు.. ‘సారు చెప్పిన కేసు ఏమైంది? ఏం నిర్ణయం తీసుకున్నారు’ అంటూ పలుమార్లు ఫోన్లు చేసి వెంటనే సెటిల్‌ చేయాలని హుకుం జారీ చేశారు. నేరుగా సర్వే-సెటిల్‌మెంట్‌ కార్యాలయానికి వెళ్లి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ‘మేమంటే లెక్కలేదా? సారు చెప్పినా ఎందుకు సెటిల్‌ చేయడం లేదు? ఈ రోజు క్లియర్‌ చేయాల్సిందే.

మేం చెప్పినట్లుగా అనుకూలమైన ఆర్డర్‌ ఇవ్వాలి. లేకుంటే పోస్టులోనే లేకుండా చేస్తాం. మరెక్కడా పోస్టు ఇవ్వకుండా కూడా చేస్తాం’ అని తీవ్రంగా బెదిరించినట్లు తెలిసింది, అయినా ఆయన లొంగకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారిని సైతం రంగంలోకి దించినట్లు సమాచారం.

రూల్స్‌ అంగీకరించవని చెప్పినా..

కోర్టు చెప్పినట్లుగా తనస్థాయిలో విచారించడం కుదరదని, అందుకు రూల్స్‌ సమ్మతించవని కమిషనర్‌ చెప్పినట్లు తెలిసింది. తొలుత సెటిల్‌మెంట్‌ అధికారి (జేసీ) ఉత్తర్వులివ్వాల్సి ఉంటుందని జైన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎస్టేట్‌ రద్దు చట్టం ప్రకారం కొత్తగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌ నాటి జేసీ, ప్రస్తుత తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్‌ను ఆదేశిస్తూ 2022 ఏప్రిల్‌ 28న లేఖ రాశారు. నాటి ప్రభుత్వ పెద్ద జోక్యంతో వెంకటేశ్‌ ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించారు. కమిషనర్‌ లేఖను లెక్కచేయకుండా.. పెద్దిరెడ్డి మనుషుల ఒత్తిళ్లకు లొంగి రఫ్‌ పట్టాయే ప్రామాణికమైనదని తేల్చారు.

Updated Date - Jul 19 , 2024 | 04:34 AM