ఆన్‌లైన్లో డ్రగ్స్ కొనుగోలు.. కొరియర్ ద్వారా సరఫరా
ABN , Publish Date - Oct 11 , 2024 | 05:23 AM
మహానగరాలకు మాత్రమే పరిమితమైన మాదవద్రవ్యాల వినియోగం నేడు పల్లెలకు సైతం వ్యాపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.యర్రంపాలెం శివారులో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ అందుకు నిదర్శనం.
రాజానగరం మండలంలో కలకలం
నలుగురి అరెస్టు.. డ్రగ్స్, గంజాయి, కారు స్వాధీనం
రాజానగరం, అక్టోబరు 10: మహానగరాలకు మాత్రమే పరిమితమైన మాదవద్రవ్యాల వినియోగం నేడు పల్లెలకు సైతం వ్యాపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి.యర్రంపాలెం శివారులో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ అందుకు నిదర్శనం. రాజమహేంద్రవరం ఇన్‌చార్జి డీఎస్పీ జి.దేవకుమార్ గురువారం రాజానగరం పోలీ్‌సస్టేషన్‌లో విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన దేవభక్తుల దినేష్, వేమన విక్రమ్ రాధా గగన్, బాలం అజయ్, దువ్వనబోయిన పుష్పరాజు స్నేహితులు. వీరిలో దినే్‌షకు మరో స్నేహితుడు పవన్‌కుమార్‌లకు ఎండీఎంఏ డ్రగ్స్, అజయ్, పుష్పరాజులకు గంజాయి తాగే అలవాటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న దినేష్ పుట్టినరోజు వేడుకలకు రాజానగరం మండలం జి.యర్రంపాలెం సమీపంలోని ఓ గెస్ట్‌హౌ్‌సలో ఏర్పాట్లు చేసుకున్నారు.
దినేష్, పవన్‌లు ఎండీఎంఏ డ్రగ్స్ కోసం గగన్ ద్వారా టెలిగ్రామ్ యాప్‌లో వచ్చే లింక్స్ ద్వారా డ్రగ్స్ విక్రయించే వారిని తెలుసుకున్నారు. వారి నుంచి రూ.32 వేల విలువజేసే క్రిప్టో కరెన్సీతో 4గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి డీటీడీసీ కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి తాడేపల్లిగూడెం తెప్పించుకుని దినేష్, గగన్ తీసుకుని పుట్టినరోజు పార్టీలో పాల్గొన్నారు. అలాగే అజయ్, పుష్పరాజ్‌లు అన్నవరం రైల్వేస్టేషన్ సమీపంలోని సాధువుల నుంచి సుమారు 50గ్రాముల గంజాయి తెచ్చుకున్నారు. వీటికి తోడు కర్ణాటకకు చెందిన 5 రెడ్ లేబుల్ లిక్కర్ ఫుల్ బాటిల్స్ అక్రమంగా తెచ్చుకున్నారు. కారులో డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న తరుణంలో రాజానగరం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వచ్చేసరికి పవన్‌కుమార్ పరారు కాగా, మిగిలిన నలుగురినీ అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 50 గ్రాముల గంజాయి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 లిక్కర్ ఫుల్ బాటిళ్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.