Share News

AP Police : జగన్‌ బంధువులకు నోటీసులు

ABN , Publish Date - Dec 04 , 2024 | 05:44 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్‌ కంప్లయింట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బంధువులకు పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

AP Police : జగన్‌ బంధువులకు నోటీసులు

  • వివేకా పీఏ కృష్ణారెడ్డి కేసులో పులివెందుల డీఎస్పీ జారీ

పులివెందుల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్‌ కంప్లయింట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బంధువులకు పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు. పులివెందుల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి, ఈసీ సురేంద్రనాథరెడ్డి, వైఎస్సార్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, న్యాయవాది ఓబుళరెడ్డితో పాటు మరో ఐదుగురికిడీఎస్పీ మురళీ నాయక్‌ నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం పది గంటలకు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి, అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌లపై పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి ప్రైవేటు కంప్లైంట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై కోర్టు ఆదేశాల మేరకు గతేడాది డిసెంబరు 15న పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లోనే విచారణ చేపట్టారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని కోర్టు ఆదేశించడంతో మరోసారి కృష్ణారెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రస్తుతం సీఆర్‌పీసీ 160 కింద పది మందిని విచారించనున్నారు.

  • వర్రా కేసులో విచారణకు నలుగురు హాజరు

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి కేసులో భాగంగా వైసీసీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ సునీతారెడ్డితో పాటు మరో ముగ్గురిని డీఎస్పీ మురళీనాయక్‌ మంగళవారం విచారించారు. గతంలో ఇచ్చిన 41ఏ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు డీఎస్పీ కార్యాలయానికి సునీతారెడ్డి, శరత్‌ కుమార్‌రెడ్డి, లింగాల రాజశేఖర్‌ రెడ్డి, వరకుమార్‌ వచ్చారు. ఈ సందర్భంగా వారిని డీఎస్పీ విచారించారు.

Updated Date - Dec 04 , 2024 | 05:44 AM