Chandrababu: రాజమండ్రి, పొన్నూరులో నేడు చంద్రబాబు ‘రా కదలిరా’ బహిరంగ సభలు
ABN , Publish Date - Jan 29 , 2024 | 08:34 AM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, గుంటూరు జిల్లా, పొన్నూరులలో ‘ రా కదలిరా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, గుంటూరు జిల్లా, పొన్నూరులలో ‘ రా కదలిరా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం హెలికాఫ్టర్‌లో పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం చేరుకుని ‘రా కదలి రా’ సభలో పాల్గొంటారు.
రా కదలిరా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు జిల్లాలకు వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, శ్రేణులు పెద్దయెత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు చంద్రబాబు కర్నూలు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరిగే రా కదలిరా సభలో పాల్గొంటారు.
అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. పొన్నూరులో రా కదలిరా సభలో పాల్గొంటారు. గుంటూరు - తెనాలి ప్రధాన రహదారిలోని నారా కోడూరు సమీపంలోని వడ్లమూడి క్వారీ సెంటర్‌లో ఈ సభ జరగనుంది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దయెతున పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలలో జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ నేతలు పిలుపు నిచ్చారు.
‘రా.. కదలిరా!’ అన్న పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలిరా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చుకుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.