Andhra Pradesh: కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం.. శాసనసభలో సీఎం ప్రకటన
ABN , Publish Date - Nov 19 , 2024 | 04:51 PM
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలొ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి ..
ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో జాతీయ రహదారుల మాదిరి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ సందర్భంగా రహదారుల నిర్మాణంపై సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలొ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలుచేస్తామని, ప్రజలు స్వాగతిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రోడ్లు గోతులమయం కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలకు టోల్ విధించేలా నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రంవరకు ఎలాంటి టోల్ రుసుము ఉండదన్నారు.
కొత్త విధానంలో..
ఔట్సోర్సింగ్ ఏజెన్సీలలో మంచివాటిని ఎంపికచేసి రహదారుల నిర్మాణం చేపడతామని, జాతీయ రహదారుల మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తారని, అయితే అన్ని వాహనాలకు టోల్ ఉండదన్నారు. కేవలం కార్లు, లారీలు వంటి భారీ వాహనాలకు టోల్ వసూలు చేస్తారని, ఆటో, బైక్, ట్రాక్టర్లకు ఎలాంటి టోల్ ఉండదని చెప్పారు. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు ఎలాంటి టోల్ విధించబోరని కేవలం మండల కేంద్రం దాటిిన తర్వాత మాత్రమే టోల్ వసూలు చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల ఆమోదంతోనే కొత్త విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నాణ్యమైన రోడ్లు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మారతాయని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిలో ఇదొక భాగమని చెప్పారు. ప్రజలను ఒప్పించిన తర్వాత మాత్రమే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.
ప్రజలను ఒప్పించే బాధ్యత..
ఔట్సోర్సింగ్ విధానంలో రహదారుల నిర్మాణం చేపట్టే అంశంపై ప్రజాప్రతినిధులు ప్రజలను ఒప్పించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ విధానానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారో చెప్పాలని సీఎం కోరగా.. ఎక్కువమంది చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తూ చేతులు ఎత్తారు. బలవంతంగా కొత్త విధానాన్ని అమలుచేయబోమన్నారు. తొలిదశలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్త విధానం అమలు చేస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చంద్రబాబు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here