Share News

ఇలాగైతే ఎలా బాస్‌!

ABN , Publish Date - Oct 10 , 2024 | 01:46 AM

జిల్లాలోని పోలీసింగ్‌ పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. బాస్‌ సమర్థుడే అయినా సిబ్బంది హద్దులు మీరడం.. కేసులను తారుమారు చేయడం.. గంజాయి పల్లెలకూ పాకిన దౌర్భాగ్యం వెరసి జిల్లా పోలీసు శాఖపై ఆరోపణలు అలముకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దాష్టీకాలు జరిగినా లాఠీ బయటకు తీయలేదు.

ఇలాగైతే ఎలా బాస్‌!

పోలీసుల్లో హద్దు మీరుతున్న బాసిజం

సిబ్బందికి కొసరు పనులెక్కువ

ఓ జోనల్‌ పోలీసు అధికారికి మరో జాఢ్యం

గ్రామాల్లోని పుట్టిన రోజుల్లో గంజాయి

కొవ్వూరు రిక్రియేషన్‌ క్లబ్‌పై అత్యుత్సాహం

పెరవలి పేకాట కేసు ఏమైందో..

జిల్లాలోని పోలీసింగ్‌ పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. బాస్‌ సమర్థుడే అయినా సిబ్బంది హద్దులు మీరడం.. కేసులను తారుమారు చేయడం.. గంజాయి పల్లెలకూ పాకిన దౌర్భాగ్యం వెరసి జిల్లా పోలీసు శాఖపై ఆరోపణలు అలముకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దాష్టీకాలు జరిగినా లాఠీ బయటకు తీయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతవరకు దాడులకు ఉపక్రమించారు. కానీ కొందరు వైసీపీ అనుకూల అధికారులు కూటమి ముసుగుతో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బదిలీల ప్రక్రియకు ఇంకా ముగింపు పలికినట్టు లేదు. ఎప్పుడు ఎవరి సీటు కదులుతుందో ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. గంజాయి గ్రామాల్లోని పుట్టినరోజు వేడుకల్లో గుప్పుమనడం ఉలికిపాటుకు గురిచేస్తోంది. కొందరు అధికారుల్లో మితిమీరిన బాసిజం, ఓ అధికారి వద్దకు వెళ్లాలంటే మహిళా పీసీలు జంకే పరిస్థితి.. కొందరు పోలీసు అధికారుల తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

యూనిఫాం సర్వీసులో బాసిజానికి కొదువ ఉండదని అంటుంటారు. ఇప్పుడు జిల్లాలోని కొందరు అధికారుల తీరు చూస్తుంటే అదే నిజమనే పరిస్థితి. ఇటీవల ఓ హోంగార్డుపై జోనల్‌స్థాయి అధికారి బహిరంగంగా వర్షంలో నిలబెట్టి బండ బూతు లతో రెచ్చిపోవడంతో సదరు హోంగార్డు ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకోవడం తోటి ఉద్యోగులను కలచివేసింది. ఆ హోంగార్డు ఉద్యోగానికి సంబం ధించిన నిర్లక్ష్యం అయితే పోనీలే అనుకోవచ్చు. కానీ ఆ అధికారి వ్యక్తిగత పనిలో సమాచారలోపం వల్ల జరిగిన పొరబాటుకు హద్దు మీరి చిందులు తొక్కడ శాఖలో చర్చనీయాంశమైంది. ఈ విషయం ఎస్పీకి విన్నవించడానికి వెళ్లగా హోంగార్డులకు బాధ్యత వహించే ఆర్‌ఐ సర్దిచెప్పి పంపేశారని తెలుస్తోంది. మహిళా సిబ్బంది విష యంలో ఆ అధికారి యూనిఫాంపై ఇప్పటికే పలు మరకలు ఉండడం గమనార్హం. విధులు నిర్వర్తించే వేళలు కూడా అందరికంటే భిన్నంగా ఉండడంతో ఆయన వద్ద పనిచేయడానికి పోలీసులు బెంబేలెత్తిపోతున్నారని సమాచారం. ఆయన ఇక్కడికి వచ్చిన ఏడాదికే ఆరుగురు డ్రైవర్లు మారారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కొసరు పనులెక్కువ

జిల్లాలోని హోంగార్డు నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకూ సిబ్బందికి అసలు పనులకంటే కొసరు పనులు ఎక్కువైపోయాయనే విమర్శలున్నాయి. జిల్లాలోని ఆ స్థాయిలో సుమారు 1200 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో సెలవు, సిక్‌ లీవ్‌, అనుమతుల రూపంలో ఉద్యోగానికి రాని వారిని, బందోబస్తులు, వీఐపీ బందోబస్తులు, కోర్టులు ఇలా రకరకాల రూపాల్లోని వాళ్లను తీసేస్తే ప్రతిరోజూ శాంతిభద్రతల నిర్వహణకు ఓ 600 మంది అందుబాటులో ఉంటారు. వీళ్లలో అధికారుల ఇళ్ల వద్ద, వ్యక్తిగత పనులకు 100 మంది వరకూ వెళ్లిపోతారు. మిగతావారు స్టేషన్లలోనే పనిచేస్తారా.. దర్యాప్తులే చూసుకుంటారా.. నేరస్తులనే పట్టుకుంటారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రాఫిక్‌ విభాగంలో సిబ్బందికంటే బీట్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక హోంగార్డులు, కాని స్టేబుళ్ల దుస్థితి మరీ దారుణంగా తయారైంది. అధి కారులు ఎవరూ కూడా సిబ్బందిని వ్యక్తిగత పనులకు వినియోగించుకోడానికి వీల్లేదు. ఎస్పీ స్థాయి అధికారులకు కాస్త మినహాయింపు ఉంటుంది. అయితే డీఎస్పీ స్థాయి నుంచి సీఐ వరకూ కొందరు ఎస్‌ఐలు కూడా తమ వ్యక్తిగత డ్రైవర్లుగా, ఇంట్లో సరు కులు తెచ్చే వారిగా సిబ్బందిని వాడేస్తున్నారు. మహిళా హోంగార్డులను అయి తే కొందరు అధికారుల ఇళ్లలో పాచి పనులు చేసే వారికంటే దారుణంగా చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. అటు ట్రైనింగ్‌ పూర్తి చేసుకొచ్చిన యువత కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులను కాకుండా కంప్యూటర్ల దగ్గర, ఆఫీస్‌ వర్కుకు కేటాయించడం గమనార్హం. దీనివల్ల జిల్లాలో చాలామంది పోలీసులు ఉన్నట్టు లెక్కల్లో చూపెడుతున్నా పోలీస్‌ విధులు నిర్వర్తించేవారు మాత్రం ఆ స్థాయి లో కానరావడం లేదు. ఇదే అంశంపై ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో కూడా చర్చకు వచ్చింది.

అత్యుత్సాహమేనా!

పలువురు పోలీసుల అత్యుత్సాహం శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చేవిధంగా ఉంటోందని అంటున్నారు. కొవ్వూరు రిక్రియేషన్‌ క్లబ్‌ సంఘటనే తాజా ఉదా హరణ. పోలీసులు రాత్రివేళ ఆ క్లబ్‌పై దాడి చేశారు. అప్పటికే అక్కడ పేకాట ఆడుతున్న సుమారు 30 మంది పోలీసుల హడావుడి చూసి కంగారు పడిపో యారు. దొరికిన దారిలో పారిపోయే ప్రయత్నంలో మొదటి అంతస్తు నుంచి కిందికి పడిపోయారు. ఇద్ద రికి తీవ్రంగా గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో వీధిలో పేకాట శిబిరం, రోడ్డుకో బెల్టుషాపు, బ్లేడ్‌ బ్యాచ్‌ల హల్‌చల్‌ వంటివి ఉన్నా ఎందుకనో దాడు లు గుర్తుకు రాలేదు. పైగా కొవ్వూరులో దాడి చేసిం ది పేకాట శిబిరంపై కాదు. క్లబ్‌పై దాడి చేసే ముం దు అనుమతులను పరిశీలించి నిబంధనల ప్రకారం నడుచుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించాల్సి ఉండాల్సిందనే అభిప్రాయం ఉంది. అప్ప టికీ శ్రుతి మించితే కఠిన చర్యలు తీసుకోవడం సబ బే. కానీ క్లబ్‌ని అనుమతుల మేరకే నిర్వహిస్తున్నా మని, సీసీ కెమెరాలను ఏర్పాటుచేశామని నిర్వాహ కులు చెప్పినా వినలేదని సమాచారం. ఇదే సబ్‌ డివి జన్‌ పరిధిలోని నిడదవోలు పోలీస్‌స్టేషను పరిధిలోకి వచ్చే పెరవలి మండలం ముక్కామలలో గత నెల 8న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసిన సమ యంలో సుమారు 30 మందిని, రూ.8 లక్షలు స్వాధీ నం చేసుకొని చివరికి రూ.6 లక్షలు తప్పించి, 25 మందిని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించినట్టు తెలిసింది.

బదిలీలకు ముగింపు లేదా?

జిల్లాలోని కిందిస్థాయి సిబ్బందిని ఎస్పీ నరసింహకిషోర్‌ ఇటీవల బదిలీ చేశారు. కానీ సీఐల బదిలీల తంతు మాత్రం అంతం కాదిది.. ఆరంభం అనే చందంగా సాగుతోంది. వైసీపీకి అనుకూలమైన వాళ్లు సందేట్లో సడేమియా మాదిరిగా మళ్లీ మంచి పోస్టింగులు దక్కించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో వివ క్షకు గురైన వారికి ఈ ప్రభుత్వంలోనూ మేలు జరగలేదనే ఆవేదన కొందరిలో ఉంది. వైసీపీ దాష్టీకాలకు తలవంచలేక లాప్‌లైనులో చేసిన వారిని మళ్లీ లూప్‌ లైనుకు లేదా వీఆర్‌కి పంపించారు. జిల్లా వీఆర్‌లో ఉన్న సిబ్బందిని ఎప్పుడు ఏ స్టేషనుకు పంపిస్తారో.. ఎవరిని ఎప్పుడు వీఆర్‌లో పెడతారో తెలియని పరిస్థితి నడుస్తోంది. ట్రై చేసుకుంటే ఏ సీటు అయినా సాధ్యమే అనే చందంగా రోజులు గడుస్తున్నాయి. దీంతో డబ్బు ఖర్చు పెట్టు కుని పోస్టింగులు పట్టుకున్న వాళ్లకూ సీటు గ్యారంటీ లేదు. మరోవైపు అనపర్తి సీఐ శివగణేశ్‌ని అకస్మాత్తుగా వీఆర్‌కి పంపించారు. ఆయన స్థానంలో సంపత్‌ హుటాహుటిన వచ్చి జాయిన్‌ అయిపో యారు. ఈయన గతంలో ఇదే స్టేషనులో ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. దాంతో స్థానిక పరిచయాలే ఆయ నకు లాభించినట్టు సమాచారం. గతంలో తీవ్ర ఆరోపణలు ఉన్న అధికారులను జిల్లా లేదా రేంజ్‌ వీఆర్‌లో పెట్టడం జరిగేది. కానీ ఇప్పుడు చిటికెలో వీఆర్‌లో పెడుతున్నారు. దీంతో సామాన్యుల భద్రతకు ఆయా అధికారులు ఎంత వరకూ భరోసా కల్పిస్తారో.. శాంతి భద్రతలను ఏ మేరకు కాపాడతారో వేచి చూడాల్సిందేననే వాదన నడుస్తోంది.

గంజాయి కలకలం

గంజాయిని ఉక్కుపాదంతో నిర్మూలిస్తామని కూటమి పాలకులు చెబుతుంటే జిల్లాలో పరిస్థితి మాత్రం ఆ మాటలను వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తోంది. గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలను ఏకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ని అందుబాటులోకి తీసు కొస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికి బాస్‌ని కూడా నియమించింది. అయితే సిటీల్లోని బర్త్‌డే వంటి పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడం వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు చిన్న గ్రామంలోని జన్మదిన వేడుకల్లో కుర్రాళ్లు గంజాయితో ఎంజాయ్‌ చేశారనే వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. భూపాలపట్నం గ్రామంలో పుట్టినరోజు వేడుకల్లో యువకులు డ్రగ్స్‌ సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వెంటనే వెళ్లారు. కారులో కొందరు గంజాయి కొడుతుండడం గుర్తించారు.

Updated Date - Oct 10 , 2024 | 06:37 AM