కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
ABN , Publish Date - Aug 29 , 2024 | 12:38 AM
పరిశ్రమలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ హెచ్చరించారు. గత జూలై నెలలో ఎన్టీఆర్ జిల్లాలోని బుధవాడ ఆల్ర్టాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో ప్రమాదాలు నివారించేందుకు, భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాస్థాయి సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అసెస్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు.
అమలాపురం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ హెచ్చరించారు. గత జూలై నెలలో ఎన్టీఆర్ జిల్లాలోని బుధవాడ ఆల్ర్టాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో ప్రమాదాలు నివారించేందుకు, భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాస్థాయి సేఫ్టీ అండ్ వెల్ఫేర్ అసెస్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 27 ప్రమాదభరితమైన పరిశ్రమలు గుర్తించి భద్రతా ప్రమాణాలపై పరిశీలన జరిపి సంయుక్త ఇన్‌స్పెక్షన్ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో జిల్లా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. 27 పరిశ్రమల ప్రతినిధులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో అమ్మెనియా నిర్వహణకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఏడు, హెక్సాన్ సాల్వెంట్ నిర్వహణకు సంబంధించిన ఫ్యాక్టరీలు, ఫెస్టిసైడ్ ఫ్యాక్టరీలు రెండు, పేపరు పరిశ్రమ ఫ్యాక్టరీలు 6, స్టీలు పరిశ్రమలు రెండు ఉన్నాయన్నారు. ఇప్పటికే పలు ఫ్యాక్టరీలకు నోటీసులు జారీ చేశామన్నారు. 14 రోజుల్లో సంబంధిత యాజమాన్యాలు నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అసంఘటిత రంగ కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించుకుని బీమా సౌకర్యం పొందేలా అవగాహన కల్పించాలని కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పార్థసారఽథి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డీకేపీ ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, డిస్ర్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ పార్థసారథి, డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గారావుదొర పాల్గొన్నారు.
వైరల్ జ్వరాల వ్యాప్తిని అడ్డుకోవాలి
ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించి జ్వర బాధితులకు చికిత్స అందించడం ద్వారా వైరల్ జ్వరాల వ్యాప్తిని అడ్డుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాధుల ప్రొఫెల్‌ను సమర్పించాలన్నారు. కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీల వారీగా కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైరల్ జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నందున పూర్తి సమాచారం సేకరించాలన్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో రోజుకు సగటున 150 జ్వరాల కేసులు నమోదు అవుతున్నాయని వైద్యాధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 61 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గారావుదొర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కార్తీక్, డాక్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు.