Share News

సుద్దగడ్డ ముంచేసింది!

ABN , Publish Date - Sep 03 , 2024 | 01:19 AM

సుద్దగడ్డ పొంగింది.. వరద తీవ్రత పెరిగి మహోగ్రరూపం దాల్చింది. ఊళ్లను ఏర్లుగా మార్చేసింది. పంట పొలాలను నదుల్ని తలపించేలా చేసింది. చివరకు జాతీయ రహదారినీ ముంచేసింది.. వెరసి భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా సుద్దగడ్డ పొంగడంతో జిల్లాలోని గొల్లప్రోలు మండలం వణికిపోయింది.

సుద్దగడ్డ ముంచేసింది!
గొల్లప్రోలులోని జగనన్న కాలనీ సమీపంలో వరి చేలల్లోకి పోటెత్తుతున్న వరద

సుద్దగడ్డ పొంగింది.. వరద తీవ్రత పెరిగి మహోగ్రరూపం దాల్చింది. ఊళ్లను ఏర్లుగా మార్చేసింది. పంట పొలాలను నదుల్ని తలపించేలా చేసింది. చివరకు జాతీయ రహదారినీ ముంచేసింది.. వెరసి భారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా సుద్దగడ్డ పొంగడంతో జిల్లాలోని గొల్లప్రోలు మండలం వణికిపోయింది. వేలాది ఎకరాల వరి, వాణిజ్య పంటలను తుడిచిపెట్టేయడంతోపాటు అనేక కాలనీల్లోకి సైతం వరదనీరు చేరడంతో ఎటుచూసినా మండలంలో అనేక గ్రామాలు చెరువులను తలపించాయి. దీంతో వందలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక నరకయాతన పడ్డారు. విషయం తెలిసిన ప్రభుత్వం బోట్లలో కాలనీలకు వెళ్లి నిత్యావసర సరుకులను అందించింది. అటు భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 12 వేల ఎకరాలకుపైగా వరి, 6 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు నీటమునిగిపోయాయి. కొన్ని రోజులుగా ముంపులో చిక్కుకున్న చేలల్లో నీరు బయటకు వెళ్లకపోవడంతో భారీగా వరి పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అటు వరద ప్రవాహం ఎక్కు వగా ఉండడంతో వరి చేలల్లోకి ఇసుక కొట్టుకువస్తుండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

భారీ వర్షాలకు సుద్దగడ్డ మహోగ్రరూపం

సోమవారం ఒక్కసారిగా భారీగా పెరిగిపోయిన వరద

గొల్లప్రోలు, ప్రత్తిపాడుల్లో నీటమునిగిన వరి, వాణిజ్య పంటలు

వాగు పొంగడంతో 216 ఎన్‌హెచ్‌పైకి వచ్చేసిన నీళ్లు

గొల్లప్రోలులో కాలనీలు మునక.. బోట్లలో రాకపోకలు

భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 12వేల ఎకరాల్లో వరి మునక

కొన్ని రోజులుగా చేలన్నీ ముంపులోనే.. కుళ్లిపోతున్న పంటలు

సుద్దగడ్డ పాపం గత వైసీసీ సర్కారుదే.. అయిదేళ్లూ టెండర్లు మూలకు

మరోపక్క వరద సహాయ పనుల కోసం జిల్లా నుంచి విజయవాడకు పది బోట్లు తరలింపు

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/గొల్లప్రోలు, సెప్టెంబరు 2: వాయుగుండం ప్రభావంతో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సుద్దగడ్డ వాగుకు వరద పోటెత్తుతోంది. వాగుకు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వచ్చి చేరుతున్న వరద నీటితో ఉధృతి సోమవారం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శివారు నున్న గొల్లప్రోలు మండలం తీవ్రంగా ప్రభావితమైంది. మండలంలో అనేకచోట్ల సుద్దగడ్డ (కొండ)కాలువ గట్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గతంలో ఎన్న డూ లేనంత వరద సుద్దగడ్డ కాలువ గట్లపై నుంచి పొంగిపొర్లుతుండడంతో గొల్లప్రోలు పట్టణ శివారు ప్రాంతం అంతా నీటమునిగిపోయింది. ఎటుచూసినా వరదనీరు పోటెత్తి నదిని తలపించింది. ముఖ్యంగా పేదల ఇళ్ల కాలనీకి వెళ్లే రహదారిపై వరద నీరు ఊహించనంత భారీగా వచ్చేసింది. సుమారు అర కిలోమీటరు మేర వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. కాజ్‌వే వద్ద ఆరు అడుగులకు పైగా ఎత్తులో వరద నీరుపారింది. ఒకరకంగా చెప్పాలంటే వరద నీటిలో పేదల ఇళ్ల కాలనీ వాసులు పూర్తిగా చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఏ అవసరానికి బయటకు వెళ్లాలన్నా ఎక్కడ వరదలో కొట్టుకుపోతారోనన్న భయాందోళనలు నెల కొన్నాయి. అయితే ప్రభుత్వం దృష్టికి ఈ వ్యవహారం వెళ్లడంతో కాలనీవాసులు రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు బోట్లు ఏర్పాటుచేశారు. అటు నిత్యావసర సరుకులు కూడా అందించారు. కాలనీలో కొందరు తీవ్ర జ్వరాలతో బాధపడుతుండడంతో వారిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అలాగే పట్టణ శివారులోని సూరంపేట గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. సూరంపేటవాసులు తరచు రాకపోకలు సాగించే రైల్వే బ్రిడ్జి కింద భాగంలోకి భారీగా వరద నీరు వచ్చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ప్రత్యామ్నాయంగా ఉన్న ఊబంద బ్రిడ్జిపైనా వరద నీరు పెద్దఎత్తున ప్రవహిచడంతో జనం నరకయాతన పడ్డారు. అలాగే అక్కడ నివాసం ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగుకు వరద ఉధృతి పెరగడంతో గొల్లప్రోలు తహసీల్దారు కార్యాలయం నుంచి కరణంగారి తోట మీదుగా గొల్లప్రోలు బైపాస్‌రోడ్డు(ఎన్‌హెచ్‌-216)కు వెళ్లే రహదారిపై వరద నీరు భారీగా ప్రవహించింది. అలాగే శివాలయమాన్యం కాలనీలోకి వరద నీరు చేరింది. అయితే హైవేపై వరదపోటు అధికంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు.

చేలన్నీ చెరువులై....

సుద్దగడ్డ వరద ఉధృతితో గొల్లప్రోలు పట్టణం, పరిసర ప్రాంతాల్లోని వేలాది ఎకరాలు పూర్తిగా నీటమునిగిపోయి నదిని తలపించాయి. గొల్లప్రోలు, తాటిపర్తి, సీతానగరం, లక్ష్మీపురం, చేబ్రోలు, చినజగ్గంపేట, వన్నెపూడి, కొడవలి తదితర గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల్లో వరి, పత్తి, అపరాలు, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలు ముంపునకు గురయ్యాయి. వరద నీటి ఉధృతికి ఆయా పంటలు కొట్టుకుపోయాయి. సుద్దగడ్డతోపాటు చౌటు కాలువకు వరదలు రావడం, పుష్కర కాలువకు చినజగ్గంపేట, వన్నెపూడి గ్రామాల వద్ద గండ్లు పడటం, పోలవరం కాలువ నుంచి నీరు పొంగిపొర్లడంతో ముంపు ఊహించనంత అధికమైంది. గొల్లప్రోలు బైపాస్‌రోడ్డులో పంటపోలాలు అయితే ఏకంగా సముద్రాన్ని తలపిస్తున్నాయి. అలాగే అధికవర్షాల కారణంగా పంటకాలువలు పొంగిపొర్లి పిఠాపురం బైపాస్‌రోడ్డు, జములపల్లి, నరసింగపురం సహా పలు గ్రామాల్లోని సుమారు 400 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. అలాగే కిర్లంపూడి, ప్రత్తిపాడు, గండేపల్లి, శంఖవరం, కాకినాడరూరల్‌, తుని, కోటనందూరుతోపాటు మొత్తం 20 మండలా ల్లో భారీ వర్షాల కారణంగా వరి పంటలు పూర్తిగా నీటమునిగాయి. అనేక మండ లాల్లో వరద నీటి ప్రవాహ ఉధృతికి పెద్దఎత్తున ఇసుక మేటల చేలల్లోకి కొట్టుకు వచ్చాయి. కాగా జిల్లా వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 12వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇతర వాణిజ్య పంటలు ఆరు వేల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలాఉంటే విజయవాడ నగరం కృష్ణా నది వరద, బుడమేరు పొంగిన కారణంగా జలవిలయంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం జిల్లా నుంచి పది వరకు ఫైబర్‌ బోట్లను అధికారులు పంపించారు. ఆదివారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునా యుడు జిల్లా కలెక్టర్‌ శాన్‌మోహన్‌తో మాట్లాడారు. విజయవాడ నగరంలో అనేక రహదారులు నదిని తలపిస్తుండడంతో చిక్కుకుపోయిన ప్రజలకు సహాయక చర్యల కోసం వెంటనే బోట్లను పంపాలని ఆదేశించారు. దీంతో సోమవారం తెల్ల వారుజామునే కాకినాడ, చుట్టుపక్కల నుంచి లారీల్లో వీటిని తరలించారు.


సుద్దగడ్డ పాపం వైసీపీదే..

సుద్దగడ్డ వాగు పొంగి గొల్లప్రోలు మండలాన్ని తీవ్రంగా దెబ్బతీ యడంతో ప్రజలు తీవ్రస్థాయిలో గత వైసీసీ సర్కారుపై మండిపడు తున్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరవగా, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా పనులను రద్దు చేసింది. వాస్తవానికి రూ.128 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏలేరు మొదటి విడత ఆధునికీకర ణ పనులు టీడీపీ హయాంలో 60 శాతం పూర్తికాగా, మిగిలిన పను లను వైసీపీ గాలికి వదిలేసింది. అలాగే ఏలేరు రెండోదశ కింద సుద్దగడ్డ ఆధునికీకరణకు రూ.145 కోట్లతో 2019 జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు రద్దు చేసేసింది. జగన్‌ సర్కారు అధికారంలో ఉన్న అయిదేళ్లలో సుద్దగడ్డను పూర్తిగా గాలికి వదిలేసింది. చివరకు రెండేళ్ల కిందట గొల్లప్రోలులో నిర్వహించిన సభలో ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు నిఽదులు మంజూరు చేస్తున్నట్టు జగన్‌ సీఎం హోదాలో ప్రకటించారు. అయితే టీడీపీ ప్రభు త్వంలో సిద్ధంచేసిన రూ.145 కోట్ల అంచనాలు గత వైసీపీ సర్కారు నిర్వాకం మూలంగా ఏకంగా రూ.750కోట్లకు పెరిగింది. అయినా ఫలి తం సున్నా. అలాగే సుద్దగడ్డ వాగు వల్ల గొల్లప్రోలులోని పేదల ఇళ్ల కాలనీకి వెళ్లే రహదారి ముంపునకు గురవుతుండడంతో రూ.70 లక్షలతో బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించినా ఒక్క రూపాయి ఇవ్వలేదు.

ముంపు తగ్గగానే నష్టం అంచనాలు వేస్తాం..

గొల్లప్రోలు, సెప్టెంబరు 2: అధిక వర్షాలు, వరదలతో వచ్చిన ముంపు తగ్గగానే పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తామని, ఈమేరకు ప్రభు త్వం నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమార్‌ తెలిపారు. ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్‌ ఏ.సీతారామశర్మతో కలిసి గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో ముంపులో ఉన్న పొలాలను ఆయన సోమవారం పరిశీలించారు. జిల్లాలో ఐదు మండలాల్లో వరద ముంపు ఎక్కువగా ఉందన్నారు. గొల్లప్రోలు మండలంలో 450 హెక్టార్లలో వరి తదితర పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాఽథమికంగా గుర్తించామని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆయన వెంట వ్యవసాయశాఖ ఏడీ పి.స్వాతి, వ్యవసాయాధికారి కేవీవీ సత్యనారాయణ ఉన్నారు.

వరద బాధితుల సాయానికి ముందుకు రావాలి : కలెక్టర్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), సెప్టెంబరు 2: రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా సహాయం చేయదలచిన వారు ఎవరైనా వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం జిల్లా రెవెన్యూ అధికారికి క్యాష్‌ రూపంలోగానీ, చెక్కు రూపంలోగానీ, వస్తురూపంలో గానీ అందజేయవచ్చని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తెలిపారు. రాష్ట్రంలో విపరీతంగా కురిసిన వర్షాల ప్రభావంతో కృష్ణా నది, బుడమేరు, గోదావరి ఉపనదులకు వరదలు రావడం వల్ల విజయవాడ, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చాలామంది ప్రజలు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. సాయంగా నగదు జమచేసే వారు బ్యాంకు ఖాతా నెంబరు 144010100020171, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కలెక్టరేట్‌ బ్రాంచ్‌లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Sep 03 , 2024 | 07:46 AM