133 మద్యం షాపులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:57 PM
నూతన మద్యం షాపుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 22 మండలాల పరిధిలో 133 మద్యం షాపుల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసింది.
(అమలాపురం-ఆంధ్రజ్యోతి): నూతన మద్యం షాపుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 22 మండలాల పరిధిలో 133 మద్యం షాపుల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఈ మద్యం షాపులను మంజూరు చేశారు. రెండు సంవత్సరాల కాలపరిమితికి లైసెన్సు మంజూరు చేయనున్నారు. షాపు ఒక్కింటికీ రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ డీడీని దరఖాస్తుతో పాటు అందజేయాలి. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులకు సంబంధించి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల గోదావరి భవన్‌లో లాటరీ ద్వారా మద్యం షాపుల ఎంపిక జరగనుంది. రిజిస్ర్టేషన్స్, అప్లికేషన్స్ జిల్లాలోని నిర్థారించిన వివిధ కార్యాలయాల్లో అందజేయాల్సిందిగా సూచించారు. అమలాపురంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్, ముమ్మిడివరంలోని ఎక్సైజ్‌స్టేషన్, కొత్తపేట, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులను స్వీకరిస్తారు. 11వ తేదీ లాటరీలో షాపులు దక్కించుకున్న వారికి ఈ నెల 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు అర్హత కలిగి ఉంటారు. జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజులను నిర్ధారించారు. పదివేల జనాభా వరకు ఉన్న షాపునకు రూ.50 లక్షలు, 10వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న షాపునకు రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా కలిగిన షాపులకు రూ.65 లక్షలు, 5 లక్షలు జనాభా పైబడి ఉన్న షాపునకు రూ.85లక్షల లైసెన్సు ఫీజుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ధారించింది. రెండో సంవత్సరంలో మద్యం షాపుల నిర్వహణకు 10 శాతం ఫీజు అదనంగా పెంచి 12 సమాన వాయిదాల్లో చెల్లించాలని సూచించారు. దీనిలో భాగంగా జిల్లాలో రూ.55లక్షలు ఫీజు చెల్లించే షాపులు 6, రూ.65లక్షలు లైసెన్సు ఫీజు చెల్లించే షాపులు 127 ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు అప్లికేషన్ ఫీజును రూ.2లక్షలు నాన్‌రిఫండబుల్‌గా చెల్లించాలి. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లయినా వేసుకోవచ్చు. ప్రతీ అప్లికేషన్‌కు రూ.2 లక్షల డీడీ, రూ.5 కోర్టు ఫీజు స్టాంపును అతికించాలని, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు పుస్తకం, నోటరీ ఐడీకార్డు, అవసరమైన ఇతర ధ్రువపత్రాలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను అందించాల్సిందిగా జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ఎస్కేడీవీ ప్రసాద్ సూచించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అమలాపురంలోని గోదావరి భవన్‌లో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కోసం అప్పుడే లాబీయింగ్‌లు ప్రారంభమయ్యాయి.