వర్మపై దాడి.. పవన్ సీరియస్..!
ABN , Publish Date - Jun 10 , 2024 | 03:34 AM
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు..
వన్నెపూడి ఘటనపై విచారణకు ఆదేశం
కో-ఆర్డినేటర్ శ్రీనివాస్‌కు బాధ్యతలు
వారం రోజుల్లో పిఠాపురానికి జనసేనాని
నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు
జనసైనికులు సంయమనం పాటించాలి: నాగబాబు
అమరావతి (ఆంధ్రజ్యోతి), పిఠాపురం, జూన్ 9: పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపే బాధ్యతలను పిఠాపురం కో-ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అప్పగించారు. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజీబిజీగా ఉంటారు. అనంతరం ఆయన పిఠాపురం వెళ్లి అక్కడ పరిస్థితిని చక్కదిద్దనున్నారు. ఈ లోగా సంఘటనకు కారణాలు, ఇతర అంశాలపై పార్టీ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ నివేదిక సిద్ధం చేయాని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగానే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాలొన్నట్టు తెలిస్తే మాత్రం వారిపై తీవ్ర చర్యలు ఉంటాయన్న హెచ్చరికలు పంపించారు. తప్పు చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించది లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఇప్పటికే హెచ్చరించారు. అధినేత పవన్ కల్యాణ్ వచ్చిన తర్వాత ఘటనపై తుదినిర్ణయం తీసుకోనున్నారు.
ఘటనపై వివరాలు సేకరిస్తున్నాం: నాగబాబు
వన్నెపూడిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మపై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు పార్టీ దృష్టికి వచ్చాయని, దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆదివారం తెలిపారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుచేసిన వారిని ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, పిఠాపురం కో-ఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక నేతలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జనసైనికులందరూ సంయమనం పాటించాలని కోరారు. సాధ్యమైనంత వరకూ తాను కూడా నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటానని, సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.