YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై బైరెడ్డి సిద్ధార్థ్ రియాక్షన్
ABN , Publish Date - Jun 07 , 2024 | 06:32 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి ఒక్క నంబర్ మిస్సయ్యి 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో అసలేం జరిగింది..? ఎందుకింత ఘోర పరాజయం..? అని తెలుసుకునే పనిలో హైకమాండ్ నిమగ్నమైంది. ఇక ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్న వైసీపీ నేతలు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడేస్తున్నారు. కొందరు వలంటీర్ల వల్లే ఓటమి అంటే.. మరికొందరు సజ్జల వల్లే ఈ గతి అని.. ఇంకొందరు ధనుంజయ్ రెడ్డి వల్లేనని ఓడిపోయిన నేతలు చెబుతున్న పరిస్థితి. ఇక తాజాగా శాప్ చైర్మన్, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు.
బలంగా వెళ్తాం..!
‘ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. వైసీపీ ఓడిపోయిందనే బాధకన్నా.. ప్రజలు మమ్మల్ని ఎక్కడ చెడుగా అనుకుంటారో అన్నదే బాధగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు న్యాయం చేయాలనే తపన, అభివృద్ధి చేయాలనే పనిచేశాం. ఎక్కడ తప్పు జరిగింది..? అనేదానిపై సమీక్షించుకుంటాం. మేం కూడా కూర్చొని అంతర్గతంగా చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో ప్రజల్లోకి బలంగా వెళ్తాం’ అని బైరెడ్డి చెప్పుకొచ్చారు.
సహించేది లేదు..!
‘మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులపై దాడులు చేయలేదు. కానీ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. టీడీపీ నాయకులు.. మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేరు, గుర్తింపు వచ్చిదంటే కారణం నందికొట్కూరు ప్రజలు, నాయకులు.. వైసీపీ, వైఎస్ జగన్ మెహన్ రెడ్డే. అందుకే తుదిశ్వాస వరకూ వైసీపీలోనే ఉంటా.. వైఎస్ జగన్ కోసమే పనిచేస్తాను. ఈ ఐదు సంవత్సరాలు పార్టీకోసం కష్టపడతాను. గడిచిన 11 ఏళ్లకంటే గట్టిగానే కష్టపడతాను’ అని బైరెడ్డి స్పష్టం చేశారు.