Share News

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:12 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్‌ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

పోస్టాఫీసుకు వచ్చిన కవర్లు ఆర్వోకు పంపకుండా వెనక్కి

ఒంగోలులో 156 కవర్లను తిప్పి పంపిన పోస్టల్‌ సిబ్బంది

టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మరోసారి పంపించిన వైనం

రేపు సాయంత్రానికల్లా అందకపోతే వృథా అయ్యే ప్రమాదం

‘ప్రకాశం’లో సర్వీసు ఓటు వేసినవారు 5వేల మందికి పైనే

ఇప్పటికీ జిల్లా అధికారులకు చేరింది 1,896 ఓట్లు మాత్రమే

(ఒంగోలు-ఆంధ్రజ్యోతి)

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్‌ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రక్షణ సిబ్బంది పోస్టులో పంపిన సర్వీసు ఓట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందించాల్సి ఉండగా వాటిని గుట్టుగా వెనక్కి తిప్పి పంపుతున్న వైనం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పోస్టాఫీసుకు మే 14న 156 సర్వీసు ఓట్ల కవర్లు రాగా వాటిని పోస్టల్‌ సిబ్బంది ఆర్వోకు ఇవ్వకపోగా తిరిగి వెనక్కు పంపేశారు.

తాము పంపిన కవర్లు వెనక్కి వచ్చినట్లు ఓ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో ఆసలు వ్యవహారం బయటపడింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును ముందుగా వినియోగించుకొనే అవకాశం కల్పించినట్లే దేశ రక్షణ విభాగం, ఇతర కేంద్ర సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 6,850 సర్వీసు ఓట్లు ఉన్నాయి. అందులో 90 శాతం ఒంగోలు లోక్‌సభ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌ పోస్టాఫీసు నుంచి 156 మంది రక్షణ ఉద్యోగులు తమ ఓట్లను ఒంగోలు లోక్‌సభ ఆర్వో అయిన కలెక్టర్‌కు పంపారు.


మే 14న ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయానికి ఆ కవర్లు వచ్చాయి. అయితే స్థానిక పోస్టల్‌ సిబ్బంది వాటిని 18న తిరిగి వెనక్కి పంపారు. కవర్లు తిరిగి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగి ఒకరు కనిగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి విషయాన్ని తెలిపారు. దీంతో టీడీపీ నేతలు ఒంగోలు, హైదరాబాద్‌ల్లో విచారించి పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్లు వెనక్కిపోయినట్లు నిర్ధారించుకున్నారు. ఇదే విషయమై లంగర్‌హౌజ్‌ పోస్టుమాస్టర్‌కు ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ 156 కవర్లను శనివారం తిరిగి ఒంగోలు పంపినట్లు తెలిసింది.

కాగా, సోమవారం సాయంత్రంలోపు అందిన సర్వీసు ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ సమయానికి అవి అందుతాయా.. లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రకాశంలో దాదాపు 5వేల మందికి పైగా సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పటికి జిల్లా అధికారులకు 1,896 సర్వీసు ఓట్లే అందాయి. తాజా ఘటనతో సర్వీసు ఓట్ల మాయాజాలానికి కూడా అధికార పార్టీ వైసీపీ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూటమి నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 07:10 AM