తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం
ABN , Publish Date - Jun 29 , 2024 | 04:39 AM
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. రోడ్డుకు అతి సమీపానికి ఏనుగులు రావడం కలకలం సృష్టించింది.
తిరుమల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. రోడ్డుకు అతి సమీపానికి ఏనుగులు రావడం కలకలం సృష్టించింది. మార్గంలోని ఏడవ మైలు వద్ద సుమారు ఏడు ఏనుగుల గుంపు రోడ్డు సమీపానికి వచ్చింది. చెట్లను విరుస్తూ ఘీంకారాలతో హల్చల్ చేయడం గమనించిన యాత్రికులు బెంబేలెత్తిపోయారు.
తమకు ఏమైనా హాని కలిగిస్తాయోమోననే భయంతో వాహనాలు ఆపేశారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు ఆగిపోయాయి. టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ విభాగాల అధికారులు, సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లిపోయేలా శబ్దాలు చేశారు. 20 నిమిషాల తర్వాత ఏనుగులు అడవిలోకి వెళ్లిపోవడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఏటా ఇదే సమయానికి ఏనుగుల గుంపు నీటిని వెతుక్కునే క్రమంలో రోడ్డు సమీపానికి వస్తుంటాయని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు వాహనదారులను కూడా అప్రమత్తం చేస్తామన్నారు.