Share News

Erraji Jyoti :2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:50 AM

‘పారిస్‌ ఒలింపిక్స్‌ మంచి అనుభవం ఇచ్చింది. 2028లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే సమ్మర్‌ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించే దిశగా సాధన చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి తెలిపింది.

 Erraji Jyoti :2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

  • ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం

  • అంతర్జాతీయ అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి

  • విశాఖలో ఘనస్వాగతం

విశాఖపట్నం స్పోర్ట్సు, ఆగస్టు 20: ‘పారిస్‌ ఒలింపిక్స్‌ మంచి అనుభవం ఇచ్చింది. 2028లో లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే సమ్మర్‌ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించే దిశగా సాధన చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్‌ ఎర్రాజీ జ్యోతి తెలిపింది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొని మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్న ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్‌ అసోసియేషన్‌, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో జ్యోతి మాట్లాడుతూ... ‘ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొంటున్న తొలి అథ్లెట్‌గా గుర్తింపు రావడంతో కొంత ఒత్తిడికి గురయ్యాను.

దీనికితోడు హీట్స్‌ ముందు రోజు వరకు గాయం కొంత ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ క్వాలిఫై కావాలని రౌండ్‌-1లో పట్టుదలతో పరుగు తీసినా ఆశించిన ఫలితం సాధించలేకపోయా. ఉద్దండులైన అథ్లెట్లతో పోటీపడడంతోపాటు ఒలింపిక్స్‌ వంటి అతి పెద్ద ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌పై రేస్‌లో పాల్గొనడం మంచి అనుభవాన్నిచ్చింది.


ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అకాడెమీలు ఏర్పాటుచేసి మంచి శిక్షణ అందిస్తే ఉన్నత స్థాయి అథ్లెట్లు రూపొందుతారు. ఔత్సాహికులకు ప్రభుత్వం నుంచి తగిన పోత్సాహం అందితే ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్‌, ఒలింపిక్స్‌ వంటి అత్యున్నత స్థాయి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ మీట్స్‌లో దేశానికి పతకాలు అందించే అథ్లెట్లు తయారవుతారు’ అని అభిప్రాయపడింది.

జ్యోతికి స్వాగతం పలికిన వారిలో ఒలింపిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కంచరాన సూర్యనారాయణ, కోశాధికారి మోహన్‌ వెంకటరామ్‌, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాధికారి జూన్‌ గ్యాలియట్‌, కోచ్‌లు, మాజీ ఒలింపియన్‌ ఎంవీ మాణిక్యాలు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 05:50 AM