Share News

Excise Department : ఎక్సైజ్‌లో ‘డిప్యుటేషన్ల’ అధికారి!

ABN , Publish Date - Dec 21 , 2024 | 06:26 AM

ఎక్సైజ్‌ శాఖలో అధికారుల కొరత ఉన్నప్పటికీ డిప్యుటేషన్ల పరంపర కొనసాగుతోంది. ఓవైపు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల (ఈఎస్‌) కొరత ఉండగా, కొందరు అధికారులు ఇతర శాఖల్లో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారు.

Excise Department : ఎక్సైజ్‌లో ‘డిప్యుటేషన్ల’ అధికారి!

  • మొన్నటివరకూ రాజ్‌భవన్‌, ఇప్పుడు సీడాప్‌

  • ఎక్సైజ్‌లో అధికారుల కొరత ఉన్నా బయటికే..

  • ఉపసభాపతి పీఎ్‌సగా మరో ఈఎస్‌

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖలో అధికారుల కొరత ఉన్నప్పటికీ డిప్యుటేషన్ల పరంపర కొనసాగుతోంది. ఓవైపు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల (ఈఎస్‌) కొరత ఉండగా, కొందరు అధికారులు ఇతర శాఖల్లో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారు. తాజాగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వ్యక్తిగత కార్యదర్శిగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఓ ఈఎస్‌ను నియమించారు. టాస్క్‌ఫోర్స్‌లో ఈ నెలాఖరుకు మరో ఈఎస్‌ రిటైర్‌ కాబోతున్నారు. ఇక ఇటీవల సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఏపీ(సీడాప్‌) సీఈవోగా మరో ఈఎస్‌ నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన రాజ్‌భవన్‌లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. గత ప్రభుత్వం ఎక్సైజ్‌ నుంచి విడివడిన సెబ్‌లో పనిచేయడం ఇష్టంలేని ఆయన వైసీపీ సభల నిర్వహణ బాధ్యతలు చూసే ఓ ఎమ్మెల్సీ సిఫారసుతో రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ పదవీకాలం ముగియగానే తిరిగి మాతృశాఖలో చేరకుండా కూటమి నేతల సిఫారసుతో సీడాప్‌ సీఈవో అయ్యారు. మరోవైపు ఎక్సైజ్‌ శాఖలో అటు టాస్క్‌ఫోర్స్‌తో పాటుగా గంజాయి సాగు ఎక్కువగా ఉండే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఈఎస్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారుల కొరత కారణంగా ఆ జిల్లాలను ఇన్‌చార్జ్‌లతో నడిపిస్తున్నారు. అయితే సొంత అధికారులను డిప్యుటేషన్‌పై పంపి, ఖాళీలను ఇన్‌చార్జ్‌లతో నెట్టుకురావడంపై విమర్శలు పెరుగుతున్నాయి. అలాగే, గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో సిఫారసులు చేయించుకున్న వారికి.. ఇప్పుడు మళ్లీ కూటమి నేతలు సిఫారసు చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 21 , 2024 | 06:26 AM