Pharma company explosion: ఊపిరి తీసిన ‘ఆవిరి’!
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:38 AM
Pharma company explosion: ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయి గది నిండా ఆవరించినప్పుడు... కరెంటు స్విచ్ వేసినా భారీ పేలుడు సంభవిస్తుంది! పైకప్పు, గోడలను సైతం బద్ధలు చేసేంత విధ్వంసం జరుగుతుంది.
విస్ఫోటానికి అదే కారణం సాల్వెంట్ లీకేజీని ముందే గుర్తించిన సిబ్బంది
ఈలోపే ప్యానల్‌పై పడి రసాయన చర్య
కర్మాగారం మూసివేత
ఊపిరి తీసిన ‘ఆవిరి’!
ఎసెన్షియాలో విస్ఫోటానికి అదే కారణం
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయి గది నిండా ఆవరించినప్పుడు.. కరెంటు స్విచ్ వేసినా భారీ పేలుడు సంభవిస్తుంది! పైకప్పు, గోడలను సైతం బద్ధలు చేసేంత విధ్వంసం జరుగుతుంది. బుధవారం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన విస్ఫోటం కూడా ఇలాంటిదే! ఇక్కడ ఈ విధ్వంసానికి కారణమైంది.. మిథైల్ టెరిషరీ బ్యుటైల్ ఈథర్! ఈ ద్రవరూప రసాయనం లీకై ఎలక్ట్రిక్ కేబుళ్లపై పడటం.. ఆ వేడికి ఆవిరి మేఘాలుగా మారడం.. చిన్న ‘స్పార్క్’ కారణంగా భారీ విస్ఫోటం జరగడంతో 17 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలలేదని.. ఆవిరి మేఘాల విస్ఫోటమే (వేపర్ క్లౌడ్ ఎక్స్‌ప్లోజన్) ఈ ఘోరానికి కారణమని తేలింది.
లీకేజీ ముందే గుర్తించినా..
ఎసెన్షియాలో అనుభవజ్ఞులు, నిపుణులైన సిబ్బంది ఉంటే.. ఈ పేలుడు జరిగేదే కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. రెండో అంతస్థులోని రియాక్టర్ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు పంప్ చేస్తున్న సాల్వెంట్... ప్లాంజ్ జాయింట్ వద్ద లీకవుతున్న విషయాన్ని సిబ్బంది గమనించారు. అది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ర్టికల్ ప్యానల్స్‌పై పడుతున్నట్టు గుర్తించారు. దాని తీవ్రత, పరిణామాలు మాత్రం వారికి తెలియలేదు. అయినప్పటికీ లీకేజీని ఆపడానికి ప్రయత్నించారు. పైకి వెళ్లి సాల్వెంట్ పైపులైన్ వాల్వ్‌ను కట్టేశారు. అయితే.. అప్పటికే రసాయన చర్య మొదలైంది. వేడిగా ఉన్న విద్యుత్ ప్యానెల్ బోర్డుపై.. త్వరగా ఆవిరయ్యే స్వభావమున్న మిథైల్ టెరిషరీ బ్యుటైల్ ద్రావకం పడటంతో వెంటనే ఆవిరి మేఘాలు (వేపర్ క్లౌడ్స్) ఏర్పడ్డాయి. ఆ ఆవిరి బయటికి పోయే వీల్లేక... కేబుల్ డక్ట్ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం వ్యాపించింది. అంతలోనే స్పార్క్ వచ్చి పెద్ద పేలుడు సంభవించింది. ఆ ధాటికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని సిమెంట్ స్తంభాలు విరిగిపోయాయి. గోడలన్నీ కూలిపోయాయి. వాటి కింద పడి కొందరు మృతిచెందారు. మంటలు వ్యాపించాయి. ఆవరణలో నిల్వ చేసిన రసాయనాలతో పాటు విద్యుత్ కేబుళ్లు కూడా అంటుకున్నాయి. దాంతో దట్టమైన పొగ అలుముకుంది. భయంతో పరుగులు తీసిన వారు శిథిలాలను ఢీకొట్టి గాయపడ్డారు. మరికొందరు మంటల్లో కాలిపోయారు. సిబ్బందిలో కొందరు ఫైర్ హైడ్రంట్ లైన్‌తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ.. పంపింగ్ చేసినపుడు ఆగడం, మళ్లీ వెంటనే మంటలు చెలరేగడంతో నిస్సహాయులుగా మిగిలిపోయారు.
పైకి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్న 13 మంది
ఎసెన్షియా కంపెనీ 250 మందిని నియమించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. అయితే, అక్కడ 380 మంది వరకు పని చేస్తున్నారు. బుధవారం విధుల్లో 40 మంది ఉన్నారు. మధ్యాహ్నం 2.18 గంటలకు పేలుడు సంభవించింది. అప్పుడే షిఫ్ట్ దిగిన ఒక బృందం బయటకు వస్తుండగా... రెండో షిఫ్ట్‌కు వచ్చిన వారు లోపలికి వెళ్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పేలుడు సంభవించగానే 13 మంది పరుగులు తీస్తూ మెట్ల పైనుంచి పైఫ్లోర్‌కి వెళ్లిపోయారు. దాంతో వారి ప్రాణాలు దక్కాయి. పేలుడు ధాటికి పీడీ ల్యాబ్ విభాగాధిపతి అక్కడికక్కడే చనిపోయారు. కొందరు చెబుతున్నట్లుగా అక్కడ రియాక్టర్ పేలలేదని ఒక అధికారి తెలిపారు. ‘వంట గదిలో ఎల్‌పీజీ గ్యాస్ లీకైనపుడు కరెంట్ స్విచ్ వేయగానే పేలుడు జరుగుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. ఆవిరి మేఘాలతో నిండిపోయిన హాలులో ఇగ్నిషన్ వల్ల పేలుడు సంభవించింది’’ అని వివరించారు. ఒక బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం ధ్వంసం కావడం, కేబుల్ లైన్లన్నీ కాలిపోవడం వల్ల ఎసెన్షియాలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపి వేశారు. ఇతర బ్లాకుల్లో ఉత్పత్తి చేసినా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, కంపెనీని తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్టు ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ నారాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
డ్రోన్ కెమెరాతో పరిశీలన..
ఈ ప్రమాదంపై అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. పేలుడు సమయంలో కంపెనీ ఆవరణలో ఉన్న ఉద్యోగులతో మాట్లాడి, ఏం జరిగిందో తెలుసుకొని... దానిని సాంకేతికంగా విశ్లేషించి నివేదిక ఇచ్చారు. పరిశ్రమ నిర్వహణకు అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక దళం అధికారులు కూడా ఫ్యాక్టరీ లోపలికి వెళ్లలేకపోయారు. భారీ పేలుడు, భవనంలో కొంత భాగం కూలిపోవడం, దట్టమైన రసాయన పొగల వల్ల లోపలికి వెళ్లలేదు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లి గాయపడిన వారిని రక్షించారు. మృతదేహాలను బయటికి తెచ్చారు. లోపల ఇంకా మృతదేహాలున్నాయా? బాధితులున్నారా? అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరా పంపి క్షుణ్నంగా పరిశీలించారు. సీఎం చంద్రబాబు గురువారం కారిడార్‌లో నిలబడే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. లోపలికి వెళ్లడం మంచిది కాదని నిపుణులు సూచించడంతో బయటే ఆగిపోయారు.