Share News

Car Accident : ముగ్గురు వైద్యుల దుర్మరణం

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:37 AM

కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వైద్యులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రం సమీపాన జరిగిందీ ప్రమాదం.

 Car Accident : ముగ్గురు వైద్యుల దుర్మరణం

  • అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు

  • అనంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • అందరూ బళ్లారికి చెందినవారే

విడపనకల్లు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వైద్యులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రం సమీపాన జరిగిందీ ప్రమాదం. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విమ్స్‌ ఆస్పత్రికి చెందిన కంటి వైద్య నిపుణుడు గోవిందరాజు(52), క్యాన్సర్‌ వైద్య నిపుణుడు యోగేశ్‌(54), ఆయుర్వేద వైద్యుడు అమర గౌడ్‌, రాయల్‌ సిటీ ఆస్పత్రి మేనేజర్‌, వైద్యుడు వెంకటనాయుడు(53) థాయిలాండ్‌ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి కారులో బళ్లారికి బయల్దేరారు. విడపనకల్లు సమీపంలో సిద్ధార్థ్థ పెట్రోల్‌ బంకు వద్ద కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టి నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే ఐ-ఫోన్‌ జీపీఎస్‌ ద్వారా యోగేశ్‌ కుటుంబసభ్యులకు తెల్లవారుజామున 3.25 గంటలకు సమాచారం వెళ్లింది. దీంతో వారు విడపనకల్లుకు చేరుకుని ప్రమాద స్థలాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు.

చెట్టును ఢీ కొన్న అనంతరం కారు ఎగిరి పక్కనే ఉన్న జొన్న చేనులోకి ఒరిగిపోగా, దానిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో కుటుంబసభ్యులకు తొలుత కారు జాడ కనిపించలేదు. అనంతరం గ్రామస్థుల సాయంతో కాసేపటికి కారును గుర్తించారు. కారులో ఇరుక్కుపోయిన గోవిందరాజు, యోగేశ్‌, వెంకటనాయుడు మృతదేహాలను పోలీసులు ఎక్స్‌కవేటర్‌ సాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అమరగౌడ్‌ను బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. విడపనకల్లు పోలీసులు విచారణ చేపట్టారు.

Updated Date - Dec 02 , 2024 | 04:37 AM