Share News

AP Police : రామ్‌గోపాల్‌ వర్మ పరారీ!

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:46 AM

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్‌ మీడియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్‌ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉంది.

AP Police : రామ్‌గోపాల్‌ వర్మ పరారీ!

  • సోషల్‌ మీడియాలో పోస్టులపై కేసు

  • అరెస్ట్‌ భయంతో అజ్ఞాతంలోకి.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

  • రెండోసారీ విచారణకు రాకపోవడంతో

  • హైదరాబాద్‌లోని నివాసానికి పోలీసులు

  • పోలీసులతో వర్మ న్యాయవాది గొడవ

  • ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీత

  • వర్చువల్‌గా విచారించాలని మెసేజ్‌

  • కోయంబత్తూరులో ఉన్నట్టు సమాచారం

ఒంగోలుక్రైం/బంజారాహిల్స్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్‌ మీడియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్‌ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉంది. అయితే, విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ తరఫు న్యాయవాది పోలీసులతో మాట్లాడుతూ.. ఆర్జీవీ ఇంట్లో లేరని చెప్పారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడే విచారణకు మరింత సమయం కావాలని తాము కోరామని, అయినప్పటికీ అరెస్టు చేసేందుకు ఎందుకు వచ్చారని నిలదీశారు.

వర్చువల్‌గా విచారించేందుకు అవకాశం ఉందని, ఆ మాధ్యమంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, ఇదే విషయాన్ని వర్మ కూడా వాట్సాప్‌ ద్వారా పోలీసులకు తెలిపారు. వర్చువల్‌ విచారణకు అనుమతి ఇవ్వాలని విచారణాధికారిని కోరారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పోలీసులకు మరో సమాచారం అందింది. వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్టు తెలిసింది. ఆదివారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో తమిళనాడులోని కోయంబత్తురులో ఉన్నట్టు వర్మ ఫొటోలు పోస్టు చేయడం దీనికి బలాన్నిచ్చింది. దీంతో ఆ దిశగా పోలీసులు దృష్టిసారించి, తమిళనాడు పోలీసులతో మాట్లాడారు. ఈ క్రమంలో మరో పోలీసు బృందాన్ని చెన్నైకి పంపేందుకు సిద్ధమవుతున్నారు.


  • మధ్యంతర ఉత్తర్వులకేనా?

ఈ నెల 10న ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో టీడీపీ నాయకుడు మత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు రామ్‌గోపాల్‌ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి గతంలో తన ట్విటర్‌లో ఫోస్టు చేశారని రామలింగం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అధికారిగా ఒంగోలు రూరల్‌ సీఐ ఎన్‌. శ్రీకాంత్‌బాబును నియమించారు. ఈ నేపథ్యంలో వర్మకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న ఒంగోలు రూరల్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని కోరారు. అయితే, తాను ముందస్తు షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం 19న రాలేనని, వారం రోజులు గడువు కావాలని కోరుతూ విచారణాధికారికి వర్మ వాట్సప్‌ మెసేజ్‌ చేశారు. అదేవిధంగా తన న్యాయవాది ద్వారా లేఖను పంపించారు. ఈ క్రమంలో విచారణాధికారి ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని కోరుతూ వర్మకు మరోసారి నోటీసులు అందించారు. ఈక్రమంలో వర్మ న్యాయపోరాటం చేస్తూనే పోలీసులకు సహకరిస్తానని చెబుతూ వచ్చారు. తొలుత తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.

Updated Date - Nov 26 , 2024 | 03:47 AM