సొసైటీల్లో అక్రమాలపై విచారణ జరపాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:15 AM
వైసీపీ ప్రభుత్వంలో సహకార సొసైటీల్లో అనేక అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.
ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చారు
గంజాయికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి
పోలీసుల సమస్యలు పరిష్కరించండి
అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో సహకార సొసైటీల్లో అనేక అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోపరేటివ్ సొసైటీలను స్వతంత్రంగానే ఉంచాలని, ప్రతి రెండేళ్లకోసారి ఆడిట్‌ను తప్పనిసరి చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో సొసైటీలను నిర్వీర్యం చేశారని, కృష్ణా సహకార కేంద్ర బ్యాంకులో ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు. సొసైటీలకు ఎన్నికలు జరపకుండా, వాటిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు విమర్శించారు. కోటప్పకొండ శివరాత్రి ఉత్సవాలకు దేవదాయ శాఖ నుంచి నిధులు కేటాయించాలని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు కోరారు.
పోలీసుల పరిస్థితి దయనీయం
సొంత వాహనాల్లేక, ఉన్నా వాటిలో పెట్రోలుకు డబ్బుల్లేక పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. పెట్రోల్, డీజిల్ కోసం ఇతరులను డబ్బు అడిగే పరిస్థితి పోలీసులకు రాకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసులకు మంచి వాహనాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు.
గంజాయి నిర్మూలనకు బడ్జెట్ కేటాయించాలి
గంజాయి వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని యలమంచిలి ఎమ్మెల్యే ఎస్.విజయ్‌కుమార్ తెలిపారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కారణంగా ఆ నియోజకవర్గం తీవ్ర వెనుకబాటుకు గురైందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆరోపించారు. బీసీ సబ్‌ప్లాన్‌ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ కోరారు.
శిథిలావస్థలో తుఫాను షెల్టర్లు
దివిసీమలో తుఫాను షెల్టర్లు శిథిలావస్థకు చేరాయని, వాటిని పునర్నిర్మించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. సరిగ్గా ఇదే రోజున దివిసీమ ఉప్పెన సంభవించిందని, పది వేల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అప్పుడు నిర్మించిన సైక్లోన్ షెల్టర్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో చిన్న రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరారు. కోనసీమ జిల్లాను కేరళ తరహాలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. ఉద్దానంలో తాగునీటి సమస్యను పరిష్కరించి, కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు.
ఇకపై రైతు సేవా కేంద్రాలు
రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మారుస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేలకు సొసైటీలకు అనుసంధానం లేకుండా పోయిందన్నారు. రెండిటినీ సమన్వయం చేస్తామన్నారు. పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారూ పోటీకి అర్హులేనని తెలిపారు. దీనికి సంబంధించిన ఏపీ కోపరేటివ్ సొసైటీల చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ చట్టంలో సవరణలకు మంత్రి కొల్లు రవీంద్ర మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.