AP Govt Clears: ఆర్టీసీ సిబ్బందికి నైట్ అలవెన్సు
ABN , Publish Date - Dec 18 , 2024 | 03:54 AM
ఆర్టీసీ సిబ్బందికి ఆర్నెల్లుగా ఆగిన నైట్ అవుట్ అలవెన్సులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది..
విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు
జీతంతో పాటు చెల్లించాలని ఆదేశం
రూ.300 నుంచి రూ.150కు
కోశారంటూ ఉద్యోగుల ఆవేదన
అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సిబ్బందికి ఆర్నెల్లుగా ఆగిన నైట్ అవుట్ అలవెన్సులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది జూలై నుంచి నిలిచిన ఈ అలవెన్సులు ఇకపై ప్రతినెలా జీతంతో పాటు చెల్లించాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కార్పొరేషన్‌గా ఉన్న ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడే విధుల్లో ఉంటే యాజమాన్యం నైట్ అలవెన్స్ చెల్లించేది. ఎన్ని నైట్ అవుట్లు చేస్తే.. సంబంధిత మొత్తాన్ని వారికి తర్వాతి నెల జీతంతో కలిపి ఇచ్చేవారు. 2020 జనవరిలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణా శాఖ(పీటీడీ) ఉద్యోగులుగా మార్చారు. తర్వాత ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయి. అయితే ప్రతి నెలా జీతభత్యాలు ఎంత అనేది ఆర్టీసీ హౌస్ నుంచే లెక్కించి, ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పీటీడీ సిబ్బందికి ఆర్థిక శాఖ నుంచే జీతాల చెల్లింపును మార్పు చేశారు. ట్రెజరీలో బిల్లుల చెల్లింపునకు కమీషన్ ఇచ్చేందుకు పీటీడీ సిబ్బంది అంగీకరించకపోవడంతో ఒక ప్రాంతానికి చెందిన ట్రెజరీ అధికారి.. నైట్ అవుట్ అలవెన్సు పద్దు లేదం టూ మెలిక పెట్టారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు అలవెన్సులు ఆగిపోయాయి. దీనిపై ఎంప్లాయీస్, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, వైఎ్‌సఆర్ పీటీడీ అసోసియేషన్లు రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి, సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌లకు వినతిపత్రాలు ఇచ్చాయి. దీంతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు టీఏ అలవెన్స్ అని ఇచ్చేదాన్నే.. ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్స్ పేరుతో చెల్లిస్తున్నారని అధికారులు వివరించారు. ఈ విషయమై ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యం లో ఎట్టకేలకు సమస్య పరిష్కారం అవడంతో ఇకపై జీతాలతోపాటు నైట్‌అవుట్ అలవెన్సులు రూ.150 చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈయూ, ఎన్‌ఎంయూ, కార్మిక పరిషత్ యూనియన్ల నేతలు ప్రభుత్వానికి, మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అలవెన్స్ మొత్తాన్ని సగానికి తగ్గించడం అన్యాయమని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. తాము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం అయినందున, వారితో సమానంగా రూ.300 చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయమై రవాణా మంత్రి కార్యాలయం వివరణ ఇస్తూ నైట్ అవుట్ అంటే కేవలం 12 గంటలు మాత్రమేనని అందుకే రూ.150 చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది.