Govt Employees : గత ఐదేళ్లలో శాఖలన్నీ ధ్వంసం
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:30 AM
గత ఐదేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు రూ.25 వేల కోట్లు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు.
అందుకే బకాయిల్ని వెంటనే తీర్చాలని కోరలేం
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు రూ.25 వేల కోట్లు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి తెలిసినవారిగా.. మా బకాయిలను వెంటనే చెల్లించాలని అడిగే పరిస్థితి లేదు. నీ, బాకీలు ఎక్కడికీపోవు..ఉద్యోగులకు అందుతాయనే భరోసాను ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నా’’మని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారానికి తామంతా పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభకు హాజరైన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నిస్తే కేసులు పెడతామనే రీతిలో వ్యవహరించి ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఇచ్చిన శ్వేతపత్రంలో చంద్రబాబు.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై వివరాలు ఇచ్చారని చెప్పారు. ఇందులో రూ.21,920 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయనీ... ఎరియర్స్ కలుపుకొంటే రూ.25 వేల కోట్లు పైబడి బకాయి ఉందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ మైనస్ పది శాతానికి పడిపోయిందన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వర్మ, కార్యదర్శి విస్సన్న తదితరులు పాల్గొన్నారు.