Govt Employees : రెండేళ్లా.. ఐదేళ్లా!
ABN , Publish Date - Aug 26 , 2024 | 04:51 AM
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ఒకటైన రవాణాశాఖలో అవినీతి దారులు కూడా ఎక్కువే. ఆ దారుల్లో పోస్టింగ్స్ దక్కించుకోవడం కోసం ఎంవీఐలు నాలుగు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు.
రవాణా శాఖలో బదిలీలపై గందరగోళం
ఆర్థిక శాఖ ఆదేశాలే ఫైనల్ అంటున్న కమిషనర్
రెండేళ్లకే బదిలీలు చేసుకోవచ్చంటున్న కార్యదర్శి
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ఒకటైన రవాణాశాఖలో అవినీతి దారులు కూడా ఎక్కువే. ఆ దారుల్లో పోస్టింగ్స్ దక్కించుకోవడం కోసం ఎంవీఐలు నాలుగు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు.
ప్రతి రెండేళ్లకోసారి బదిలీలు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నం ఇప్పుడు రవాణా శాఖలో గందరగోళానికి దారి తీసింది. ప్రభుత్వం(ఆర్థిక శాఖ) ఐదేళ్లు దాటిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఇటీవలే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదే అవకాశంగా ఎంవీఐలు, ఆర్టీవోలు బదిలీల కోసం చక్రం తిప్పారు.
ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి విజయవాడలోని ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి బదిలీలు కోరుకొంటున్న వారి సమ్మతితో రెండేళ్ల జీవో తీసుకు రాగలిగినట్లు రవాణా శాఖలో ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 17న ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 75కు భిన్నంగా రవాణా శాఖ జీవో 23విడుదల చేసింది. శాఖాధిపతి సౌలభ్యం కోసం బదిలీలు చేసుకోవచ్చంటూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే జీవోలో పేర్కొన్నారు.
ఆదాయ మార్గాల్లోని పోస్టింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎంవీఐలు, ఆర్టీవోలు, డీటీసీలు సైతం ఆర్థిక పరమైన ఆఫర్లతో పైరవీలు మొదలు పెట్టారు.
ఈ విషయం కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా దృష్టికి రావడంతో కొందరు ఉన్నతాధికారులతో చర్చించారు. ఎలాంటి వివాదాలకూ తావివ్వకూడదని, ప్రభుత్వ మార్గదర్శకాలే పాటించాలంటూ అంతర్గత సర్కులర్ జారీ చేశారు.
రెండేళ్లకు తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధన ఇప్పుడు అమలు చేయవద్దంటూ ఉన్నతస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో బదిలీల ఆశలు పెట్టుకున్న ఎంవీఐలు, ఆర్టీవోలు ఉలిక్కి పడ్డారు. ఇదేంటని రవాణా శాఖ మంత్రికి చెప్పే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది.