Share News

Guntur Chilli Yard: మిర్చి మేత రూ.347 కోట్లు!

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:31 AM

గుంటూరు మిర్చి యార్డు అక్రమాలు, కుంభకోణాలకు కేంద్రంగా మారింది. రైతుల సేవలో తరించాల్సిన యార్డు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నేతలకు కాసులు కురిపించే కల్పవృక్షంగా మారింది. పాలకవర్గం, అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రూ.కోట్లు స్వాహా చేశారు.

Guntur Chilli Yard: మిర్చి మేత  రూ.347 కోట్లు!

  • జీరో, కట్‌ బిజినె్‌సతో యార్డు ఆదాయానికి గండి

  • ఈ-నామ్‌లో నమోదు చేయకుండానే అమ్మకాలు

  • లైసెన్సుల రెన్యువల్‌లోనూ భారీగా అవినీతి

  • అక్రమార్కులకు వత్తాసు పలికిన అధికారులు

  • అందులో గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ పేరు

  • 20 మంది సిబ్బందిపైనా అభియోగాలు నమోదు

(గుంటూరు సిటీ-ఆంధ్రజ్యోతి)

గుంటూరు మిర్చి యార్డు అక్రమాలు, కుంభకోణాలకు కేంద్రంగా మారింది. రైతుల సేవలో తరించాల్సిన యార్డు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు నేతలకు కాసులు కురిపించే కల్పవృక్షంగా మారింది. పాలకవర్గం, అధికారులు, సిబ్బంది కుమ్మక్కై రూ.కోట్లు స్వాహా చేశారు. మిర్చి ఎగుమతుల్లో ఆసియాలోనే మొదటి స్థానంలో నిలిచిన ఈ మిర్చి యార్డు... అక్రమాల్లోనూ టాప్‌లో ఉందని విచారణలో తేలింది. ఇక్కడ గత ఐదేళ్లలో రూ.347 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారిస్తూ విజిలెన్స్‌ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మిర్చి యార్డుకు తీసుకువచ్చే పంట వివరాలను ఈ-నామ్‌లో నమోదు చేసిన తర్వాత అమ్మకాలు జరపాలి. అయితే గత ఐదేళ్లలో ఈ-నామ్‌, ఈ-పోర్టల్‌తో పనిలేకుండానే అమ్మకాలు సాగించారు. రైతులు తీసుకొచ్చిన మిర్చిని రికార్డుల్లో ఎక్కించకుండా జీరో వ్యాపారం చేశారు. ఈ విధంగా కొన్ని లక్షల క్వింటాళ్ల మిర్చి అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ పెద్దఎత్తున ఆదాయానికి గండి కొట్టారు. కొన్ని సందర్భాల్లో ఈ-నామ్‌లో మిర్చి ధరను తక్కువగా నమోదు చేసి ఆదాయాన్ని పక్కదారి పట్టించారు. కట్‌ బిజినెస్‌ పేరుతో సాగిన ఈ వ్యవహారంతో యార్డుకు రావాల్సిన ఫీజుకు నష్టం వాటిల్లింది.


  • లైసెన్స్‌ ఒకరిది.. వ్యాపారం మరొకరిది

సాధారణంగా లైసెన్స్‌ ఉన్న వ్యక్తి రైతుల నుంచి 2శాతం కమీషన్‌ వసూలు చేయాలి. ఒకరి పేరుతో లైసెన్స్‌ ఉండి, మరొకరు వ్యాపారం చేసి 4 శాతం నుంచి 5 శాతం కమీషన్‌ వసూలు చేశారు. ఒకే ఇంట్లో ఐదారుగురికి లైసెన్స్‌లు మంజూరు చేశారు. దానివల్ల ప్రభుత్వానికి వ్యాపారులు చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు గండి పడింది. ఉదాహరణకు ఒక రైతు రూ.కోటి వరకు వ్యాపారం చేస్తే ఆదాయపు పన్ను చెల్లించాలి. అంతే మొత్తం వ్యాపారాన్ని ఐదుగురు చేసినట్లు చూపితే పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఒకే ఇంట్లో పలువురికి లైసెన్స్‌లు మంజూరు చేయడంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాజకీయంగా పెద్ద కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఈ పద్ధతిలో లైసెన్స్‌లు ఇచ్చినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. లైసెన్స్‌ రెన్యువల్‌కు ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసును పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెటింగ్‌ శాఖ అనుమతి కూడా ఉండాలి. గత ఐదేళ్లలో అవేమీ లేకుండానే రెన్యువల్‌ ప్రక్రియ జరిగింది. అందుకోసం భారీగా లంచాలు పుచ్చుకున్నట్లు విజిలెన్స్‌ నిర్ధారించింది. వైసీపీ నేతల ఆదేశాలతో మార్కెటింగ్‌ ఉన్నతాధికారి, యార్డు కార్యదర్శులుగా పనిచేసిన ప్రభుత్వ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. యార్డు చైర్మన్‌గా కొద్ది నెలల పాటు మాత్రమే ఉన్న ఒక నాయకుడు అక్రమాలకు గేట్లు ఎత్తినట్లు గుర్తించారు. లైసెన్స్‌ రెన్యువల్‌ అక్రమాలు కూడా అప్పుడే జరిగాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఆ మాజీ చైర్మన్‌ పేరును నేరుగా ప్రస్తావించారు.


  • అధికారులకూ పాత్ర

మిర్చి యార్డులో జరిగిన కుంభకోణంలో అధికారులు కూడా కీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్‌ నివేదిక పేర్కొంది. మార్కెటింగ్‌లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులతో పాటు, యార్డు సెక్రటరీలుగా పనిచేసిన వారిపైనా అభియోగాలు మోపారు. సుమారు 20మంది సిబ్బంది పేర్లు నివేదికలో ప్రస్తావించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల హాజరుతో పనిలేకుండా, కనీసం సంతకాలు కూడా లేకుండా వారు పనిచేస్తున్నట్లు చూపించి జీతాలు విత్‌డ్రా చేశారు. యార్డు నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా జీతం తీసుకుంటున్న ఒక వ్యక్తి ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై విషప్రచారం చేసినట్లు తేలింది. ఈ విషయం అప్పట్లోనే జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.

  • స్టాండింగ్‌ కౌన్సిల్‌ విఫలం

ఆసియాలోనే అతి పెద్దదిగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించిన లీగల్‌ విషయాల్లో అడుగడుగునా నిర్లక్ష్యం ఉన్నట్లు విజిలెన్స్‌ గుర్తించింది. యార్డు కార్యకలాపాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన వారిని న్యాయపరంగా నిలువరించే విషయంలో స్టాండింగ్‌ కౌన్సిల్‌ విఫలమైనట్లు గుర్తించారు. ఈ విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చూపించారని నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 04:31 AM