Share News

Guntur Veterinary Hospital : పిల్లి, కుక్కలకూ ఆర్థో ఆపరేషన్లు

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:46 AM

మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగి కాళ్లు, చేతులు విరిగితే.. ఆపరేషన్‌ చేసి ప్లేట్లు, రాడ్లు వేస్తారు. అదే ప్రమాదం కుక్క, పిల్లి, ఎద్దు, ఆవు వంటి జంతువుల కు జరిగితే వాటికి కూడా మనుషుల మాదిరిగానే ఆర్థో ఆపరేషన్లు చేసి రాడ్స్‌, పిన్నింగ్‌ వేస్తున్నారు.

Guntur Veterinary Hospital  : పిల్లి, కుక్కలకూ ఆర్థో ఆపరేషన్లు

  • గుంటూరు జిల్లా పశువైద్యశాల డాక్టర్ల ప్రత్యేకత

  • ఎముకలు విరిగితే రాడ్స్‌, పిన్నింగ్‌ సర్జరీలు

  • ఎద్దు, ఆవులు వంటి జంతువులకు వైద్య సేవలు

  • ఎక్స్‌రే యూనిట్‌, పిన్నింగ్‌ సామగ్రి ఉంటే మరింత మెరుగ్గా..

గుంటూరు సిటీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగి కాళ్లు, చేతులు విరిగితే.. ఆపరేషన్‌ చేసి ప్లేట్లు, రాడ్లు వేస్తారు. అదే ప్రమాదం కుక్క, పిల్లి, ఎద్దు, ఆవు వంటి జంతువుల కు జరిగితే వాటికి కూడా మనుషుల మాదిరిగానే ఆర్థో ఆపరేషన్లు చేసి రాడ్స్‌, పిన్నింగ్‌ వేస్తున్నారు. గుంటూరులోని కొత్తపేటలో ఉన్న జిల్లా పశువైద్యశాలలో గత రెండేళ్లుగా ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్నారు. పశువుల డాక్టర్‌ లక్కింశెట్టి నాగేశ్వరరావు(సర్జన్‌) ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా 40కి పైగా ఆర్థో సర్జరీలు విజయవంతంగా చేశారు. ఎక్స్‌రే యూనిట్‌, ప్లేటింగ్‌ సామగ్రి వంటి వసతులు ఆస్పత్రిలో లేకున్నప్పటికీ.. పశువుల విరిగిన ఎముకలకు తిరిగి జీవం పోస్తున్నా రు. ఏదైనా ప్రమాదానికి గురయ్యే జంతువుల్లో ఫ్యాక్చర్‌(ఎముకలు విరగటం)ను సింపుల్‌, కాంపౌండ్‌ అని విభజిస్తున్నారు. సింపుల్‌ ఫ్యాక్చర్‌లో పైన శరీరం బాగానే ఉండి లోపల ఎముకలు విరుగుతాయి. ఎక్స్‌రే ద్వారా ఎముక ఎక్కడ విరిగిందో గుర్తించి శస్త్రచికిత్స చేస్తారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో కేవలం పిండి కట్టు వేసి వదిలేసేవారు. దానివల్ల విరిగిన ప్రదేశంలో వాపు రావటం, ఎముక పూర్తిగా కట్టుకోక పోవడంతో ప్రమాదం బారిన జంతువు జీవితకాలం వైకల్యంతోనే బతకాల్సి వచ్చేది. ఆ పరిస్థితిని నివారించేందుకు గుంటూరు జిల్లా పశు వైద్యశాలలో డాక్టర్‌ నాగేశ్వరరావు బృందం పిన్నింగ్‌ చేయడం, రాడ్స్‌ వేయటం చేస్తున్నారు.


ఇక కాంపౌండ్‌ ఫ్యాక్చర్‌లో పైన శరీరం దెబ్బతినడంతో పాటు లోపల ఎముక కూడా విరుగుతుంది. అటువంటి కేసుల్లో కూడా పిన్నింగ్‌, రాడ్స్‌ అమరుస్తున్నారు. ఈ ఆపరేషన్లకు 3-5 గంటల వరకు సమయం పడుతుందని పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మంగళగిరి రత్నజ్యోతి చెబుతున్నారు. ప్రమాదానికి గురయ్యే జంతువులకు ఆర్థో ఆపరేషన్‌ చేసిన 15 రోజుల తర్వాత కుట్లు విప్పుతామని, కొత్త ఎముకలు రావడానికి 8 వారాల సమయం పడుతుందని తెలిపారు. డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ చక్రవర్తి బృందం పనివేళలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.

  • థియేటర్‌ అందుబాటులోకి వస్తే..

జిల్లా పశువైద్యశాల నూతన భవన నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. రూ.30 లక్షల వ్యయంతో ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మిస్తున్నారు. అది అందుబాటులోకి వస్తే మరిన్ని కీలక సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది. మా దగ్గరకు ఇప్పుడు చాలా మేజర్‌ సర్జరీ కేసులు వస్తున్నాయి. యూరిన్‌ బ్లాడర్‌ పూర్తిగా ఛిద్రం అయిన కేసులకు కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. అవి కాక కుటుంబ నియంత్రణ, కడుపులో ఉన్న పిల్లలను బయటకు తీసేందుకు ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. థియేటర్‌తో పాటు డిజిటల్‌ ఎక్స్‌రే యూనిట్‌, ప్లేటింగ్‌ సామగ్రి ఉంటే మెరుగైన సేవలు అందించొచ్చు. ఇప్పుడు ఎక్స్‌రే కోసం ప్రమాదానికి గురైన జంతువులను బయటకు తీసుకువెళ్లాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బంది కలిగిస్తోంది.

- డాక్టర్‌ లక్కింశెట్టి నాగేశ్వరరావు,

సహాయ సంచాలకులు, పశు సంవర్థక శాఖ

Updated Date - Dec 15 , 2024 | 04:47 AM