Share News

AP Politics: ఢిల్లీ పరిణామాలపై చంద్రబాబు రియాక్షన్ ఇదే.. గత ఘటనలను గుర్తుచేసుకున్న సీఎం..

ABN , Publish Date - Dec 19 , 2024 | 06:04 PM

సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడినా, వాటిని వక్రీకరించే వారుంటారని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటను అన్నట్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని..

AP Politics: ఢిల్లీ పరిణామాలపై చంద్రబాబు రియాక్షన్ ఇదే.. గత ఘటనలను గుర్తుచేసుకున్న సీఎం..
CM Chandrababu

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మంత్రులతో సీఎం మాట్లాడుతూ.. సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడినా, వాటిని వక్రీకరించే వారుంటారని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో గతంలో వ్యవసాయం దండగ అని తాను అనని మాటను అన్నట్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్‌కు తగిన గౌరవం లభించలేదని, అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంట్‌ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేద్కర్‌కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.


కాంగ్రెస్ ఆందోళనలు..

పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రతిగా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని, అంబేద్కర్‌ను ఏ రోజూ అభిమానించని కాంగ్రెస్ ఈరోజు కపట ప్రేమ చూపిస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై బురదజల్లుతోందని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. అంబేద్కర్‌పై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదనే విషయం అమిత్ షా వ్యాఖ్యలు సృష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది. అంబేద్కర్ పేరు ప్రస్తావిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరెన్ని మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.


అమిత్ షా రాజీనామా చేయాలంటూ..

అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై బీజేపీ ఎంపీల ఫిర్యాదుతో రాహుల్‌గాంధీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీలు తమపై దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై స్పీ్కర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 19 , 2024 | 06:43 PM