Share News

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:27 PM

కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టనుంది. ఆధ్యాత్మిక ప్రాంతాలను, మెట్రో నగరాలను కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Amaravati Railway Line

అమరావతి: అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.


హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు అనుసంధానం

అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు అనుసంధానిస్తూ కొత్త లైన్‌ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో మధ్య, ఉత్తర భారతంతో దక్షిణ భారతదేశం అనుసంధానం మరింత సులువుకానుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్థూపం, ధ్యానబుద్ద, ఉండవల్లి గుహల గుండా రైల్వే మార్గం ఉండనుంది. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ నిర్మాణం కొనసాగనుంది. ఈ లైన్‌ నిర్మాణం ద్వారా కూలీలకు 19 లక్షల పనిదినాలు ఉపాధి కల్పన జరగనుంది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు 25 లక్షల చెట్లు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్‌ నిర్మాణం సాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో గల ఖమం జిల్లా, ఏపీలో ఎన్‌టిఆర్‌ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం సాగనుంది.


అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీ

అమరావతి, బీహార్‌‌కు సంబంధించి రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 6,789 కోట్ల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదించింది. ఏపీ రాజధాని అనుసంధానానికి 57 కి.మీ, బీహార్‌లో 256 కి.మీ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త లైన్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజా రవాణాకు ఉపయోగపడనుందని వివరించారు. దీంతో రద్దీని తగ్గిస్తుందని తెలిపారు.


అమరావతి రైలు మార్గానికి తొలి అడుగు...

అమరావతి రైలు మార్గానికి తొలి అడుగుపడింది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని రైలు మార్గానికి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే నిధులు కేటాయించారు. తొలిసారిగా రూ.50.01 కోట్ల నిధులను కేటాయించడంతో సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతి రైలుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.


పింక్‌బుక్‌‌‌‌లో స్థానం..

గతంలో పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌‌‌ను ఎట్టకేలకు రైల్వేపోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు కావడంతో ఏపీకి బడ్జెట్‌ కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తేలింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీల ప్రయత్నాలు ఫలించినట్లు అర్థమవుతోంది. ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అమరావతి రాజధాని నూతన రైలుమార్గానికి పింక్‌బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.


106 కిమీ పొడవున..

అమరావతి రాజధానికి రైలుమార్గం ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుని మంజూరు చేయించింది. ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్‌ ఎర్రుపాలెం - నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి - పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి - నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్‌ ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. తర్వాత బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం అవడంతో అమరావతి రైలుమార్గానికి నిధులు కేటాయించారు.


డబ్లింగ్‌లకు నిధులే నిధులు..

నిర్మాణంలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్‌ ఫండ్‌ కింద రూ.250 కోట్లు, కేపిటల్‌ ఫండ్‌ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌లో కీలకమైన నల్లమల అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు ఖర్చు కూడా ఎక్కువ కానుండటంతో బడ్జెట్‌లో రూ.480 కోట్ల కేటాయింపులు జరిపింది. రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన గుంటూరు - బీబీనగర్‌ డబ్లింగ్‌ కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు రూ.220 కోట్లు కేటాయించింది. విష్ణుపురం బైపాస్ రైలుమార్గానికి రూ.20 కోట్లు, మోటుమర్రి - విష్ణుపురం డబ్లింగ్‌ ప్రాజెక్టుకి రూ.50 కోట్లు కేటాయించింది. 88 కిలోమీటర్ల పొడవునా నిర్మించే రైలుమార్గంలో మోటుమర్రి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జీ నిర్మిస్తారు. గుంటూరు యార్డులో మల్టీ ట్రాకింగ్‌ కనెక్టివిటీ పనుల కోసం మరో రూ.50 కోట్లు కేటాయించింది.


ఇవి కూడా చదవండి..

Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం

AP Highcourt: నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 04:09 PM