Share News

AP News: మహేశ్ బాబు ఫ్యాన్‌కి ‘పోకిరి’ సినిమా చూపిస్తూ బ్రెయిన్‌ సర్జరీ.. ఇలా ఎందుకు చేశారంటే..

ABN , Publish Date - Feb 04 , 2024 | 08:06 AM

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ కాసేపు సినిమా థియేటర్‌గా మారింది. రోగికి ఇష్టమైన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.

AP News: మహేశ్ బాబు ఫ్యాన్‌కి ‘పోకిరి’ సినిమా చూపిస్తూ బ్రెయిన్‌ సర్జరీ.. ఇలా ఎందుకు చేశారంటే..

  • రోగి మెలకువగా ఉండగానే గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్‌

  • ఏపీ ప్రభుత్వ వైద్య రంగంలో ఇదే మొదటిసారి

గుంటూరు(మెడికల్‌), ఫిబ్రవరి 3: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ కాసేపు సినిమా థియేటర్‌గా మారింది. రోగికి ఇష్టమైన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ తరహా ఆపరేషన్లు జరిగాయి. కానీ ఏపీ ప్రభుత్వ వైద్యరంగంలో మాత్రం తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్‌ (ఎవేకెన్‌ బ్రెయిన్‌ సర్జరీ) చేసినట్లు గుంటూరు జీజీహెచ్‌ వైద్య వర్గాలు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన పండు(48) కాలు, చేయి బలహీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తీసుకొచ్చారు.

స్కానింగ్‌లో అతని మెదడులోని మోటార్‌ కార్టెక్స్‌ అనే భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. అత్యంత సున్నితమైన భాగం కావడంతో దానిని తొలగించే క్రమంలో రోగి కుడి కాలు, చేయి చచ్చుబడే ప్రమాదం ఉంది. ఆపరేషన్‌ సమయంలో రోగిని మెలకువగా ఉంచి, అతని కాళ్లు, చేతుల కదలికలను గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించాలని న్యూరో వైద్యులు నిర్ణయించారు. జనవరి 25న రోగికి లోకల్‌ అనస్థీషియా ఇచ్చి ఎవేకెన్‌ బ్రెయిన్‌ సర్జరీ చేశారు. పండు హీరో మహేశ్‌బాబు అభిమాని కావడంతో, ల్యాప్‌ట్యాప్‌లో ‘పోకిరి’ సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ ముగించారు. అరుదైన ఆపరేషన్‌ చేసిన వైద్య బృందాన్ని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ అభినందించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - Feb 04 , 2024 | 08:06 AM