YS Jagan: విజయసాయికి మాత్రమే కనిపించిన జగన్ మంచితనం..
ABN , Publish Date - Oct 27 , 2024 | 08:15 PM
సొంత చెల్లి, కన్న తల్లిపై జగన్‌కు కనికరం లేదని, కుటుంబానికంటే ఆస్తులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. జగన్‌లో అంత మంచితనమే ఉంటే సొంత చెల్లి, తల్లి ఎందుకు అసహించుకుంటారనేది పెద్ద ప్రశ్న. 2019 ఎన్నికల ముందు తల్లిని, చెల్లిని..
వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. జగన్, షర్మిల ఆస్తుల వివాదంపై స్పందించిన ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు కోసమే షర్మిల జగన్‌ను టార్గెట్ చేశారని, మాట్లాడుతూ.. జగన్ అతి మంచితనం ఆయనకు అనర్థాలు తెచ్చిపెడుతోందని వ్యాఖ్యానించారు. అయితే జగన్‌లో కనిపించిన మంచితనం ఏమిటో మాత్రం విజయసాయి చెప్పలేదు. సొంత చెల్లి, కన్న తల్లిపై జగన్‌కు కనికరం లేదని, కుటుంబానికంటే ఆస్తులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. జగన్‌లో అంత మంచితనమే ఉంటే సొంత చెల్లి, తల్లి ఎందుకు అసహించుకుంటారనేది పెద్ద ప్రశ్న. 2019 ఎన్నికల ముందు తల్లిని, చెల్లిని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరినీ పక్కనపెట్టేశారు. కొన్నాళ్ల తర్వాత తల్లి విజయలక్ష్మిని గౌరవధ్యక్షురాలు పదవి నుంచి తప్పించారు. సొంత తల్లికి పార్టీలో పదవి ఉండటాన్ని ఇష్టపడని జగన్‌లో విజయసాయికి ఎటువంటి మంచితనం కనిపించిందో ఏపీ ప్రజలకు మాత్రం ఇప్పటికీ అర్థం కావడంలేదట. జగన్‌లో అతి మంచితనమే ఉంటే.. ఇతర పార్టీ నాయకులపై ఎందుకు రాజకీయంగా కక్ష తీర్చుకున్నారో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
మంచితనంతోనే అరాచక పాలన సాగించారా..!
2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్‌లో అతి మంచితనమే ఉంటే అరాచక పాలనను ఎందుకు ప్రోత్సహించినట్లు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నట్లు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు రాజకీయ పదవులు ఎందుకు కట్టబెట్టినట్లు.. సొంత బాబాయిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు జగన్ ఎందుకు మద్దతుగా నిలిచారు. అతి మంచితనంతోనే ఇవ్వన్నీ జగన్ చేశారా. తన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించే జగన్‌లో విజయసాయిరెడ్డికి ఎటువంటి మంచితనం కనిపించిందనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. వైసీపీలో ఐదేళ్లపాటు పదవులు అనుభవించి, జగన్‌కు దగ్గరగా ఉన్న నేతలే.. జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నవేళ విజయసాయి రెడ్డి మాత్రం జగన్ అతి మంచితనమే నష్టం చేస్తోందని వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందనే చర్చ నడుస్తోంది.
షర్మిలపై విజయసాయి..
టీడీపీ డైరెక్షన్‌లో షర్మిల పనిచేస్తోందంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుపెడితే దానికి టీడీపీకి ఏమి సంబంధమనేది విజయసాయి రెడ్డి చెప్పిఉండాల్సింది. రాష్ట్ర ప్రజల్లో జగన్‌పై వ్యతిరేకత రావడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారని విజయసాయి చెప్పడం ఓ రకంగా నవ్వు తెప్పించే అంశమే అవుతుంది. ఆస్తుల వివాదంలో జగన్ వైఖరిని షర్మిల ప్రజల ముందుపెట్టింది. ఒకవేళ షర్మిల వ్యాఖ్యలు తప్పైతే.. వాటిపై జగన్ స్పందించి ఉండాల్సింది. తన సోదరి, తల్లితో వివాదాన్ని పరిష్కరించుకోకుండా.. ఎవరిపైనో ఆరోపణలు చేసి, కుటుంబ వివాదాన్ని రాజకీయం చేసుకోవడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఆశించే జగన్‌తో విజయసాయిరెడ్డికి ఎలాంటి మంచితనం కనిపించిందో ఆయనే సమాధానం చెప్పాలి మరి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here