Share News

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

ABN , Publish Date - Mar 11 , 2024 | 07:09 AM

YS Jagan Siddham Sabha: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులపాలైంది..

Siddham: జగన్‌.. గ్రాఫిక్స్‌ ‘షో’

  • మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మాయ!

  • సభా ప్రాంగణమంతా గ్రీన్‌ మ్యాట్‌

  • గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసే యత్నం

  • సభకు 15–20 లక్షల మంది

  • వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా

  • వంత పాడిన జగన్‌ రోత మీడియా

  • ప్రసంగం ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం

  • సరిగా చేయని గ్రాఫిక్స్‌తో

  • అడ్డంగా దొరికిపోయిన వైనం

  • సోషల్‌ మీడియాలో చెడుగుడు

  • డ్రోన్‌ కెమెరాపైనా సభలో రాద్ధాంతం

  • లోకేశ్‌ పంపారని ఆరోపణలు

  • ‘ఐ ప్యాక్‌’దని తేలడంతో గప్‌చుప్‌

(ఒంగోలు–ఆంధ్రజ్యోతి) :

కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులపాలైంది. ఆదివారం ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌ (CM YS Jagan Reddy) ‘సిద్ధం’ సభకు లక్షలకు లక్షలు జనం తరలి వచ్చినట్టు సొంత రోత మీడియాలో చూపించేందుకు ‘షో’ చేసింది. ఇదంతా గ్రాఫిక్స్‌ మాయ అని తేలడంతో సోషల్‌ మీడియాలో వైసీపీని ఆడుకున్నారు. దీన్ని కవర్‌ చేసుకోలేక నానా పాట్లు పడింది. మేదరమెట్ల వద్ద 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైసీపీ నేతలు భావించారు. డబ్బు, అధికారాన్ని ఉపయోగించి భారీగా జనసమీకరణ చేయాలని చూశారు. కానీ చివరకు 50 ఎకరాల్లోనే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేందుకు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు, స్కూల్‌ బస్సులను తీసుకున్నారు. డబ్బు, బిర్యానీ, మందు పంపిణీ చేశారు. అయినా ఆశించినంత జనం రాలేదు.

YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!

గ్రీన్‌ మ్యాట్‌ పరచి..

50 ఎకరాల సభా ప్రాంగణంలో దాదాపు 2.50 లక్షల మంది జనం పడతారన్నది సాధారణ అంచనా. అయితే మేదరమెట్ల సభా ప్రాంగణం పూర్తిగా నిండలేదు. సీఎం జగన్‌ మాట్లాడే సమయంలో ముందుభాగాన కార్యకర్తలు కనిపించగా, వెనుక భాగమంతా బోసిపోయింది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన వైసీపీ నేతలు సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ‘ముందస్తు’ ప్లాన్‌ వేశారు. ఇందుకు టెక్నాలజీని వాడుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సభాప్రాంగణం మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ గ్రీన్‌ మ్యాట్‌ పరిపించారు. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో సిద్ధం సభకు లక్షలాది మంది జనం పోటెత్తినట్టు చూపే ప్రయత్నం చేశారు. ఇందుకు జగన్‌ రోత మీడియా వంత పాడింది. జగన్‌ సిద్ధం సభకు 15–20 లక్షల మంది వచ్చారని వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ ప్రసంగ ప్రత్యక్షప్రసారం కూడా డిలేడ్‌ లైవ్‌ (కొద్ది నిమిషాల పాటు ఆలస్యంగా ప్రసారం) ఇచ్చారు. లైవ్‌ మధ్యలో గ్రాఫిక్స్‌ జత చేసి భారీగా జనం వచ్చినట్లు చూపే ప్రయత్నంలో భాగంగానే అలా చేసినట్లు తేటతెల్లమైంది. జగన్‌ పార్టీ, ఆయన రోత మీడియా గ్రాఫిక్స్‌ ‘మాయ’పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు, కామెంట్లు వచ్చాయి.

Telangana: తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. సీఎం నేనే..!!


డ్రోన్‌ కెమెరాతో దొరికిన వైసీపీ

సభలో ఒక డ్రోన్‌ కెమెరాతో వీడియో తీసేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చారు. సీఎం జగన్‌ రాకముందు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడే సమయంలో ఆవరణలో మరో డ్రోన్‌ కెమెరా చిత్రీకరణ చేస్తూ కనిపించింది. ఆ డ్రోన్‌ కెమెరాలో జనం నిండక ఖాళీగా ఉన్న ప్రాంగణం కనిపిస్తుందని, దృశ్యాలు చిత్రీకరిస్తుందని వేదికపై ఉన్న నేతలు బెంబేలెత్తిపోయారు. మంత్రి అంబటి రాంబాబు అయితే ఆ కెమెరాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశే పంపారని ఆరోపించారు. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్‌ విసిరారు. ఆ వెంటనే ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ కుడా మైక్‌ ముందుకొచ్చి ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడారు. ఆ వెంటనే పోలీసులు ఎగురుతున్న రెండో డ్రోన్‌ కెమెరాతో పాటు దానిని ఆపరేట్‌ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వైసీపీకి రాజకీయ సలహాలు అందిస్తున్న ఐప్యాక్‌ సంస్థ ప్రతినిధే ఆ కెమెరాను ఆపరేట్‌ చేస్తున్నట్టు తేలింది. దీంతో అప్పటి వరకు రెచ్చిపోయి మాట్లాడిన వైసీపీ నేతలు సైలెంట్‌ అయిపోయారు.

సభలో జామర్లు

సభలో జరిగే లోటుపాట్లు బయటకు పొక్కకుండా ఉండడానికి వైసీపీ మరో కొత్తమార్గాన్ని ఎంచుకుంది. సిద్ధం సభా ప్రాంగణంలో జామర్లు అమర్చి దాదాపు నాలుగు గంటల పాటు అక్కడి జనానికి బాహ్యప్రపంచానికి సంబంధాలు తెంచేసింది. గతంలో జరిగిన సిద్ధం సభకు లక్షల మంది జనం వచ్చారని వైసీపీ నేతలు గొప్పలకు పోయారు. అయితే సెల్‌ టవర్‌ ఆధారంగా ఒరిజినల్‌గా సభకు హాజరైన జనం సంఖ్యను గణాంకాలతో టెకీ నిపుణులు ఎండగట్టారు. అధికార పార్టీ చెప్పిన సంఖ్యకు అక్కడ వాస్తవంగా హాజరైన జనానికి పొంతనలేదు. దీంతో వైసీపీ ఈసారి సిగ్నల్స్‌ నిలిపేసే కొత్త ఎత్తుగడకు తెరలేపిందని తెలుస్తోంది.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Mar 11 , 2024 | 07:34 AM