Share News

YS Jagan: చేసిదంతా చేసి.. నీతులు చెబుతున్నారా..!

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:03 AM

ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు. ఓ రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. ఆర్థిక వనరులు ఉండాలి. అప్పులపై రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న..

YS Jagan: చేసిదంతా చేసి.. నీతులు చెబుతున్నారా..!
YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో దోపిడి రాజ్యమేలుతోందంటూ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓసారి తన పాలనను గుర్తుచేసుకున్నారేమోనని కొందరు.. ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారానికి తెరలేపారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇప్పటివరకు ప్రవేశపెట్టలేకపోయిందని జగన్ చెప్పారు. అదే సమయంలో ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు. ఓ రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. ఆర్థిక వనరులు ఉండాలి. అప్పులపై రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న జగన్.. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖజనాను పూర్తిగా ఖాళీ చేయడంతో పాటు.. ఆదాయ వనరులను పెంచేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదనేది బహిరంగ రహస్యం. చెప్పుకోదగ్గ పరిశ్రమలను తీసుకురావడంలో జగన్ ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరిగింది.

అవునా జగన్‌! మీరు అబద్ధాలే ఆడరా?


ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్‌కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు సర్వనాశనం చేసి వదిలేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని, ప్రస్తుతంత రాష్ట్రంలో ఆర్థిక వనరులను, ఆదాయ మార్గాలను పెంచే పనిలో ప్రభుత్వం ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలా అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కూటమి నేతలు చెబుతున్నారు. ఓ రకంగా జగన్ గత అసమర్థ పాలన కారణంగానే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయిందనే చర్చ జరుగుతోంది.

Chandrababu : గీత దాటొద్దు!


దోచుకో.. పంచుకో.. తినుకో..

తన పాలనలో డీబీటీకి ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు పాలనలో దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) విధానాన్ని అవలంభిస్తున్నారని జగన్ విమర్శించారు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కానీ జగన్ ఈ వ్యాఖ్యలు చేసే ముందు తన ఐదేళ్ళ పాలనను గుర్తు చేసుకుని చేశారేమోననే అనుమానాలు రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నాయట. సరిగ్గా జగన్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఈ విధానాన్నే ఫాలో అయ్యారని, దాని కారణంగానే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారనే ప్రచారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జోరుగా వినిపించింది. భూ కబ్జాలు, ప్రతి కాంట్రాక్ట్‌లో కమీషన్ల విధానం జగన్ ప్రభుత్వంలో సాగిందని, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై వేధింపులు, అక్రమ కేసులకు వైసీపీ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందనే చర్చ జరిగింది. తన ప్రభుత్వంలో ఉన్నట్లే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతుందనే భ్రమలో ఉండి జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు కూటమి పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే చేసిందంతా చేసి.. జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట.


సహకార సంఘాలకు నామినేటెడ్‌ పాలకవర్గాలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 19 , 2024 | 11:03 AM