Share News

Social Media : చేయిచేయి కలిపారు!

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:17 AM

సోషల్‌ మీడియాను సమస్యలను వెలుగులోకి తేవడానికి, వాటి పరిష్కారానికి ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం!

Social Media : చేయిచేయి కలిపారు!

  • శ్రీశైలం దారిలోని పురాతన మెట్లబావికి పూర్వ కళ

  • జనాన్ని కదిలించిన ఇన్‌స్టా రీల్‌

కొత్తపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాను సమస్యలను వెలుగులోకి తేవడానికి, వాటి పరిష్కారానికి ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం! నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామ సమీపంలో ఓ పురాతన మెట్లబావి ఉంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే యాత్రికుల కోసం 15వ శతాబ్దంలో దీనిని తవ్వించారని చెబుతారు. శ్రీశైలం-ఆత్మకూరు ప్రధాన రహదారికి కొద్ది దూరంలో... ఒక పొలంలో ఈ బావి ఉంది. ఒకప్పుడు యాత్రికుల దాహార్తిని తీర్చిన ఈ బావి ఇప్పుడు చెత్తాచెదారంతో నిండిపోయింది. చుట్టూ పిచ్చి మొక్కలు! ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగంధర్‌ అనే యూట్యూబర్‌ వివిధ గ్రామాల చరిత్రలతో కూడిన వీడియోలను అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఆయన ఇటీవల గువ్వలకుంట్ల మెట్లబావి దుస్థితిపై ఈనెల 10న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్‌ పోస్ట్‌ చేశారు. అది వైరల్‌ అయి మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి కూడా వెళ్లింది. ‘మన సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక సంపదను కాపాడుకోవడం సమష్టి బాధ్యత. ఈ అద్భుతమైన బావి పూర్వ వైభవానికి, భవిష్యత్‌ తరాలకు దాని సంరక్షణను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ బావిని బాగు చేసేందుకు ‘మన ఊరు, మన గుడి, మన బాధ్యత’ సంస్థతో పాటు స్థానికులు, ఇతర స్వచ్చంద సంస్థలకు చెందిన వారు ఆదివారం రంగంలోకి దిగారు. చేయిచేయి కలిపారు. బావిలోని మురుగు నీటిని మోటార్ల ద్వారా తోడారు. సుందరంగా తీర్చిదిద్దారు. ఇకపైనా బావిని పరిరక్షించుకుంటామని గువ్వలకుంట్ల గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - Dec 17 , 2024 | 04:17 AM