Health Minister Satyakumar Yadav : వైసీపీ ఆస్పత్రులకు ఐదేళ్లు దోచిపెట్టారు
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:01 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆరోగ్యం కన్నా ఆ పార్టీతో అంటకాగే ఆస్పత్రులకు దోచిపెట్టడమే ధ్యేయంగా పనిచేశారని, వీటిపై సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
ఆరోగ్య శాఖ నిధుల మళ్లింపుపై విచారణ చేస్తాం: సత్యకుమార్
అనంతపురం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆరోగ్యం కన్నా ఆ పార్టీతో అంటకాగే ఆస్పత్రులకు దోచిపెట్టడమే ధ్యేయంగా పనిచేశారని, వీటిపై సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఆరోగ్య శాఖ నిధుల మళ్లింపు గురించి లోతైన విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంగళవారం తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధిచేసే సమర్థ నాయకుడు సీఎం చంద్రబాబు అని, ఆయన నేతృత్వంలో ఏపీ అభివృద్ధికి చిరునామాగా మారుతుందని చెప్పారు. ఆరోగ్యశాఖలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు. హాస్పిటల్స్ ఎంపానెల్‌లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1500 కోట్లకుపైగా ఉన్నాయని విమర్శించారు. జాతీయ ఆరోగ్య మండలి నిబంధనలు పాటించకుండా వైద్య కళాశాలల ఏర్పాటు పేరిట వైసీపీ ఆర్భాటం చేసిందన్నారు.