Rainfall Updates: రేపు మరో అల్పపీడనం
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:29 AM
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి.
ఎల్లుండి నుంచి దక్షిణ కోస్తా, సీమలో వర్షాలు
2 వారాల వ్యవధిలో రెండోసారి ముప్పు
ఈసారి గుంటూరు వరకూ విస్తరించే చాన్స్
ఉత్తర కోస్తా ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత
విశాఖపట్నం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి. ఈ నెల 11, 12 తేదీల్లో కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే 16 నుంచి అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈసారి కోస్తాలోని మధ్య ప్రాంతాల వరకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం శనివారం నాటికి బలహీనపడనుండగా, ఆదివారం మరొకటి ఏర్పడనుంది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఇప్పటికే రెండు తుఫాన్‌లు రాగా, మూడు రోజుల క్రితం ఒక అల్పపీడనం వచ్చింది. ఈ నెల 15న మరొకటి రానుంది. ప్రస్తుతం ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ తుఫాన్‌లకు అనువుగా ఉపరితల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు విశ్లేషించారు. సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలులతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో కొన్నిచోట్ల 50 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా, ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనంతో శుక్రవారం తమిళనాడులోని ఒక ప్రాంతంలో 54 సెం.మీ. వర్షపాతం నమోదైందని, అనేకచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయని వివరించారు.
నేడు బలహీనపడనున్న అల్పపీడనం
గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడి శుక్రవారం నాటికి లక్షద్వీప్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి పూర్తిగా బలహీనపడనుంది. అయితే శనివారం నాటికి దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవవర్తనం ఆవరించనున్నది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 17 కల్లా తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ అల్పపీడనం మధ్య/ ఉత్తర తమిళనాడు వైపు వస్తుందని కొన్ని మోడళ్లు చెబుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 16 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. 17 నుంచి 19 వరకూ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో గుంటూరు జిల్లా వరకు వర్షాలు విస్తరిస్తాయని కొన్ని మోడళ్లు చెబుతుండగా, ఉత్తర కోస్తాలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. కాగా, శుక్రవారం ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.
పొగమంచుతో ఆలస్యంగా విమానాలు
పొగమంచు కారణంగా శుక్రవారం ఉదయం విశాఖపట్నం రావాల్సిన పలు విమానాలు ఆలస్యంగా చేరుకున్నాయి. హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ ఇండిగో విమానం 2 గంటలు, బెంగళూరు-విశాఖ-బెంగళూరు ఇండిగో విమానం 1.40 గంటలు, చెన్నై-విశాఖ-చెన్నై ఇండిగో విమానం 1.15 గంటలు, బెంగళూరు-విశాఖ-విజయవాడ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1.15 గంటలు ఆలస్యంగా ఇక్కడికి వచ్చాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు.