Share News

AP High Court : కాంప్రమైజ్‌ పిటిషన్లలో కక్షిదారుల ఫొటోలు అతికించండి

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:03 AM

లోక్‌ అదాలత్‌ల ద్వారా రాజీమార్గంలో వివాదాల పరిష్కా రం విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

AP High Court : కాంప్రమైజ్‌ పిటిషన్లలో కక్షిదారుల ఫొటోలు అతికించండి

  • న్యాయవాది సంతకాలను నిశితంగా పరిశీలించండి

  • లోక్‌ అదాలత్‌ చైర్మన్లకు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌ల ద్వారా రాజీమార్గంలో వివాదాల పరిష్కా రం విషయంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌ అదాలత్‌లను ఆశ్రయిస్తున్న కక్షిదారుల్లో కొందరు మోసపూరితంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇకపై రాజీకి వచ్చే ఇరువైపుల కక్షిదారుల ఫొటోలను కాంప్రమైజ్‌ పిటిషన్‌లో అతికించాలని లోక్‌ అదాలత్‌ చైర్మన్‌లకు స్పష్టం చేసింది. అలాగే కేసుల రాజీకోసం లోక్‌ అదాలత్‌ ముందు హాజరైన న్యాయవాది, ట్రయ ల్‌ కోర్టులో వకాలత్‌ వేసినవారు ఒకరేనా? కాదా? అనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలించాలని పేర్కొంది. లోక్‌ అదాలత్‌ ద్వారా వివాద పరిష్కారానికి వకాలత్‌లో ఉన్న న్యాయవాది ముందుకు రానప్పుడు, అందుబాటులో లేనప్పుడు రాజీపత్రంపై సంతకాలు చేసే కక్షిదారులు సరైనవారేనా? కాదా అని నిర్ధారించుకొనేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చని లోక్‌ అదాలత్‌లకు స్పష్టం చేసింది. నేషనల్‌ లోక్‌ అదాలత్‌ 2009 నిబంధనల ప్రకారం కాంప్రమైజ్‌ పిటిషన్‌పై కక్షిదారులు, వారి తరఫున హాజరైన న్యాయవాదుల సంతకాలు తప్పనిసరని గుర్తు చేసింది. అలా సంతకాలు చేయకుండా జారీ చేసే అవార్డులు చెల్లుబాటుకావని పేర్కొంది. ప్రస్తుత కేసులో లోక్‌ అదాలత్‌ ముందు రాజీపత్రంపై పిటిషనర్‌ తండ్రి తరఫున న్యాయవాది చేసిన సంతకం, ట్రయల్‌ కోర్టులో వకాలత్‌ వేసిన న్యాయవాది సంతకం ఒకటిగా లేదని పేర్కొంది. పిటిషనర్‌ తండ్రి, ఆయన తరఫు న్యాయవాది సంతకం లేకుండా లోక్‌అదాలత్‌ అవార్డు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.


ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌తో కూడిన ధర్మాస నం ఇటీవల తీర్పు ఇచ్చింది. గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన పుల్లారావు ఆస్తుల పంపకంలో ముగ్గురు కుమారుల్లోని పెద్దకుమారుడు మురళీ కృష్ణ తెనాలి కోర్టులో 2023లో దావా వేశారు. వివాదాన్ని రాజీమార్గం లో పరిష్కరించుకుంటామని, కేసును లోక్‌ అదాలత్‌కు పంపించాలని అభ్యర్థించారు. దీంతో ఈ వ్యవహారం తెనాలి మండలం లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ వద్దకు చేరింది. ఆస్తి మొత్తం తన పెద్దకుమారుడికే చెందుతుందని తండ్రి పుల్లారావు అంగీకరించినట్లు పేర్కొంటూ లోక్‌ అదాలత్‌ అవార్డు జారీ చేసింది. ఈ అవార్డును సవాల్‌ చేస్తూ పుల్లారావు రెండో కుమారుడు శరత్‌ ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. లోక్‌ అదాలత్‌ వద్ద కాంప్రమైజ్‌ పిటిషన్‌లో తన తండ్రి, ఆయన తరఫు న్యాయవాది సంతకం చేయలేదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం లోక్‌ అదాలత్‌ అవార్డును రద్దు చేసింది.

Updated Date - Dec 29 , 2024 | 04:03 AM