Share News

AP Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లో?

ABN , Publish Date - May 21 , 2024 | 03:38 AM

రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసి వారం దాటిపోయింది. మరో రెండు వారాలకు గాని ఫలితాలు వెలువడవు. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరుగనుంది.

AP Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లో?

అభ్యర్థుల లెక్కలు.. పార్టీల విశ్లేషణలు.. ఇప్పటికే సర్వే బృందాల నివేదికలు

వాటిపై సమాలోచనలు.. విదేశీ పర్యటనకు ముందు బృందాలతో బాబు సమీక్ష

కూటమికి 115 రావచ్చని ఓ అంచనా.. 136 దాటొచ్చని మరో విశ్లేషణ

పోటాపోటీ అంటున్న వైసీపీ టీంలు.. తమ మద్దతు కీలకమంటున్న బీజేపీ

అటు అభ్యర్థుల వ్యక్తిగత సర్వేలు.. ప్రత్యర్థుల రిపోర్టులూ తెప్పించుకుని ఆరా

వాటితో పోల్చుకున్నాక కొందరిలో జోష్‌.. మరికొందరు బేజార్‌

సందట్లో సడేమియాలా పందెంరాయుళ్ల బెడద.. కాయాలా వద్దా అనే డైలమా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసి వారం దాటిపోయింది. మరో రెండు వారాలకు గాని ఫలితాలు వెలువడవు. ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరుగనుంది. ఇంకా చాలా సమయం ఉండడంతో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం ఓట్ల లెక్కలు, విశ్లేషణల్లో మునిగి తేలుతున్నారు. ఏ వర్గం ప్రజలు ఎవరికి ఓటేసి ఉంటారో అన్న అంచనాలపై లోతుగా చర్చించుకుంటున్నారు. ప్రత్యర్థి శిబిరం అంచనాలు ఎలా ఉన్నాయా అని ఆరాలు తీస్తున్నారు. ఈ సమాలోచనల గొడవల్లో తాముంటే మధ్యలో పందెం రాయుళ్ల దెబ్బకు నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌ సరళి ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకోవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ సాంకేతిక బృందాలతో విశ్లేషణలు తయారు చేయించుకున్నాయి. ఈ బృందాలు రకరకాల నమూనాలతో లెక్కలుగట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించి తమను నియోగించుకున్న పార్టీలకు నివేదికలు అందజేశాయి. అన్ని పార్టీల్లో ఈ కసరత్తు ఇప్పటికే పూర్తయింది. క్షేత్ర స్థాయి సమాచారంతో ఈ నివేదికలను సరిపోల్చుకునే పనిని కొత్తగా ఈ బృందాలకు అప్పగించారు. ఉదాహరణకు.. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు తమ పార్టీ కోసం పనిచేసిన సాంకేతిక బృందాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఒక లెక్క ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 115 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని.. మరో అంచనాలో కూటమి స్కోరు 136 దాటిపోతుందని ఈ బృందాలు తమ ప్రజంటేషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇదే తరహా నివేదికలను వైసీపీ నియోగించుకున్న బృందాలు కూడా ఆ పార్టీ నాయకత్వానికి ఇచ్చాయి. పరిస్థితి పోటాపోటీగా ఉందని అవి పేర్కొన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ సైతం అంచనాలు రూపొందించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కూటమే అధికారంలోకి వస్తుందని, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ టీడీపీకి సొంతంగా రాదని.. జనసేన, బీజేపీ సహకారంతోనే సర్కారు ఏర్పాటవుతుందని ఆ పార్టీ విశ్లేషిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

హుషారు.. కలవరం

పార్టీల అంచనాలతో సంబంధం లేకుండా అభ్యర్థులు కూడా ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో జనం నాడిపై సొంత విశ్లేషణలు తయారు చేసుకుంటున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా పార్టీ నేతలను పిలిపించుకుని.. అక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించే అవకాశం ఉందో తెలుసుకుని.. లెక్కలు వేసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానంలో గత నాలుగు ఎన్నికల్లో ఒక్కసారి కూడా టీడీపీ గెలువలేదు. ఈసారి అక్కడ పోటీ చేసిన అభ్యర్థి తాను 15 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తానని లెక్కగట్టారు. ప్రతి గ్రామం నేతల నుంచి సమాచారం తెప్పించుకున్న ఆయన.. గ్రామాలవారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయో లెక్కలుగట్టి ఈ విశ్లేషణ రూపొందించారు. దీంతో ఆయన అనుచర వర్గం హుషారుగా తిరుగుతోంది. టీడీపీ శిబిరంలో ఉత్సాహం చూసి ప్రత్యర్థి శిబిరంలో కలవరం ఏర్పడింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఎన్నిక పోటాపోటీగా జరిగింది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు తామే గెలుస్తున్నామని లెక్కలు వేసుకొన్నారు. రెండ్రోజుల తర్వాత వారిద్దరికీ అనుమానం వచ్చి ప్రత్యర్థి శిబిరం లెక్కలు తెప్పించుకుని సరిపోల్చుకున్నారు. ఆ తర్వాత ఒక అభ్యర్థి ముఖంలో కళ తప్పిందని ప్రచారం జరుగుతోంది.

గోదావరి జిల్లాల్లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి తన నియోజకవర్గంలో ఓటర్లు ఎటు ఓటు వేశారో తెలుసుకోవడానికి ఒక బృందాన్ని నియమించి పోలింగ్‌ అనంతర సర్వే చేయిస్తున్నారు. నియోజకవర్గంలో కనీసం పది వేల మంది ఓటర్ల మనోగతం తెలుసుకోవాలని ఆయన ఆ బృందానికి టార్గెట్‌ పెట్టారు. ఈ సర్వే ఇంకా జరుగుతోంది.

సందట్లో సడేమియా..

తమ పరిస్థితి ఎలా ఉందో అర్థంగాక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులను పందెం రాయుళ్లు ఇంకా ఒత్తిడికి గురి చేస్తున్నారు. నియోజకవర్గంలో గెలుపోటములపై బెట్టింగ్‌లు వస్తున్నాయని.. ఏం కాయాలి.. ఎంత కాయాలని కొందరు పందెం రాయుళ్లు నేరుగా అభ్యర్థులనే అడుగుతున్నారు. ‘పందెం వద్దని చెబితే నా పరిస్థితి బాగోలేదని.. భయపడుతున్నానని ప్రచారం చేస్తారు. పందెం కాయవచ్చని చెబితే తర్వాత నష్టం వస్తే నా వల్లే నష్టపోయామని నానా యాగీ చేస్తారు. ఏం చెప్పాలో తోచడం కావడం లేదు’ అని కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థి ఒకరు వాపోయారు. కొందరు అభ్యర్థులు తమ ఫలితం మీద ఏం పందేలు జరుగుతున్నాయో రహస్యంగా వాకబు చేస్తున్నారు. తమ గెలుపోటములపై బయట ఏమనుకుంటున్నారో దీనివల్ల తెలుస్తుందని వారు భావిస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 08:48 AM