Share News

Human Rights Forum : ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు

ABN , Publish Date - Dec 15 , 2024 | 05:16 AM

ప్రజాస్వామిక హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మానవహక్కుల వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యం ద్వారానే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం సాధ్యపడుతుందని అన్నారు.

Human Rights Forum : ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు

  • ప్రజా చైతన్యంతోనే తిప్పికొట్టగలం

  • మానవహక్కుల వేదిక మహాసభల్లో వక్తలు

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మానవహక్కుల వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యం ద్వారానే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం సాధ్యపడుతుందని అన్నారు. మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎ్‌ఫ) 10వ రాష్ట్ర మహాసభలు అనంతపురంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సభలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడారు. కరువులకు నిలయమైన అనంతపురం జిల్లా పౌర ఉద్యమాలకు పెట్టింది పేరని ఆయన అన్నారు. మానవ హక్కుల వేదిక ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 2009లో అనంతపురంలో జరిగిన మానవహక్కుల వేదిక మూడో రాష్ట్ర మహాసభల్లో బాలగోపాల్‌తో కలిసి తాను పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. దేశంలో అమలవుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజా చైతన్యంతోనే తిప్పిగొట్టగలమని అన్నారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను పాలకులు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని ఓపీడీఆర్‌ నాయకుడు రామ్‌కుమార్‌ విమర్శించారు. ఆదివాసీ సమస్యలపై పోరాడే స్టాలిన్‌ను నిర్బంధించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాల తరఫున గొంతెత్తేందుకు పౌరహక్కుల సంఘాలు మరింతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో ప్రజాసంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని హెచ్‌ఆర్‌ఎ్‌ఫ తెలంగాణ అధ్యక్షుడు భుజంగరావు విమర్శించారు. అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే క్రమంలో ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చేస్తున్నారని అన్నారు. వారి హక్కులను పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.


  • తెలుగు రాష్ట్రాలకు నూతన కమిటీలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు మానవ హక్కుల వేదిక(హెచ్‌ఆర్‌ఎ్‌ఫ) నూతన కమిటీలు ఎంపికయ్యాయి. తొలిరోజు సభకు రెండు రాష్ట్రాల నుంచి 144 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రానున్న రెండు సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కమిటీల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీ అధ్యక్షుడిగా శ్రీకాకుళానికి చెందిన జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శిగా అమలాపురానికి చెందిన రాజే్‌షను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఉట్నూరుకు చెందిన ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా జమ్మికుంటకు చెందిన డాక్టర్‌ ఎస్‌ తిరుపతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హెచ్‌ఆర్‌ఎ్‌ఫ ప్రచురణల సంపాదక అధ్యక్షుడుగా విశాఖపట్నానికి చెందిన అనురాధ, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులుగా జీవన్‌కుమార్‌, వసంతలక్ష్మి, చంద్రశేఖర్‌, వీఎస్‌ కృష్ణను ఎంపిక చేశారు. అనంతరం నూతన కమిటీల సమక్షంలో 24 అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం మహాసభల ప్రాంగణం నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Dec 15 , 2024 | 05:17 AM