YS Jagan: పేదల పై కపట ప్రేమ
ABN , Publish Date - May 18 , 2024 | 04:49 AM
జగన్ ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి రెండు మూడు నెలలు అయినా ఇప్పటికీ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం రూ.వేల కోట్లు కుమ్మరిస్తోంది.
జగన్ బటన్ నొక్కుడు ఉత్తుత్తేనా?
కాంట్రాక్టర్లకు మరో 700 కోట్ల బిల్లులు
అంతకుముందు 15న రూ.1,400 కోట్లు
పేదల పథకాలకు మాత్రం జమ చేయరా?
ఫిబ్రవరి నుంచి నొక్కిన బటన్ల విలువ
14,165 కోట్లు.. ఇప్పటికి జమ 1,982 కోట్లే
అదే కాంట్రాక్టర్లకైతే ఒక్క మార్చిలోనే
రూ.25 వేల కోట్లు విడుదల
ఎన్నికలు ముగిశాకా పేదలను వదిలి వారికే
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి రెండు మూడు నెలలు అయినా ఇప్పటికీ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం రూ.వేల కోట్లు కుమ్మరిస్తోంది. ఈ నెల 15వ తేదీన కాంట్రాక్టర్లకు రూ.1400 కోట్లు చెల్లించగా, 16న మరో రూ.700 కోట్లు చెల్లించారు. జగన్ ఎప్పుడో బటన్ నొక్కిన కల్యాణమస్తు, షాదీతోఫా, చేయూత, ఇన్‌పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం పథకాలకు ఇప్పటి వరకూ పైసా కూడా విడుదల చేయలేదు.
ఈ పథకాలకు బటన్ నొక్కిన తర్వాత ఒక్క మార్చి నెలలోనే కాంట్రాక్టర్లకు రూ.25 వేల కోట్లు బిల్లుల రూపంలో చెల్లించారు. ఆసరా, విద్యాదీవెనతో సహా ఆరు పథకాలకు చెల్లించాల్సింది రూ.14,165 కోట్లు మాత్రమే. అయినప్పటికీ పేదల కంటే కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేందుకు సర్కార్ తహతహలాడుతోంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు తెల్లారేసరికి రూ.14 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేస్తామని హడావుడి చేశారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వేయాలని ఈసీ ఆదేశించింది. ఆ తేదీ దాటిపోయినా పేదల ఖాతాల్లో డబ్బులు వేసి వారిని ఆదుకోలేకపోయారు.
ఆసరా, విద్యాదీవెన పథకాలకు కలిపి పేదల ఖాతాల్లో ప్రభుత్వం రూ.1982 కోట్లు మాత్రమే వేసింది. కానీ డీబీటీ ముసుగులో రెండు రోజుల్లోనే కాంట్రాక్టర్లకు రూ.2100 కోట్లు చెల్లించింది. కాగా వచ్చే మంగళవారం జగన్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నిర్వహించే వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి రూ.2 వేల కోట్లను తీసుకురానుంది. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం అధికారికంగా రూ.19 వేల కోట్లు అప్పులు తెచ్చింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఈ ఆర్నెల్లకు కేంద్రం రూ.43 వేల కోట్లకు అనుమతి ఇచ్చింది. ఆర్నెల్లకు ఇచ్చిన అనుమతిని మూడు నెలల్లోనే వాడేసేలా యథేచ్ఛగా అప్పులు చేస్తోంది.