ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:18 AM
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామానికి చెందిన ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసనమండలి పునరుద్ధరించింది.
హైకోర్టు తీర్పుతో సభ్యత్వం పునరుద్ధరణ
శృంగవరపుకోట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామానికి చెందిన ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసనమండలి పునరుద్ధరించింది. జూన్ 3నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసినట్లు మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కక్ష సాధించాలని చూసిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపిక చేసిన అసెంబ్లీ అభ్యర్థికి సహకరించేది లేదని రఘురాజుపై వైసీపీ అనర్హత వేటు వేయించింది. ఈ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే.. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడుతో వైసీపీ నామినేషన్ వేయించింది. అయితే సరైన సాక్ష్యాలు చూపించలేకపోవడంతో నవంబరు 6న హైకోర్టు రఘురాజుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నవంబరు 14న కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేయడంతో రఘురాజు తిరిగి శాసనమండలిలో అడుగుపెట్టారు. 2027 నవంబరు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.