Share News

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:48 AM

పోలవరం ప్రాజెక్టు ‘కోర్‌’ నిర్మాణాలన్నీ పటిష్ఠంగానే ఉన్నాయని.. సాంకేతికంగా అన్నీ సక్రమమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు.

International Experts : పోలవరం కోర్‌ నిర్మాణాలు పటిష్ఠమే

  • డయాఫ్రం వాల్‌కు మరమ్మతు చేయొచ్చు!

  • అంతర్జాతీయ నిపుణుల సూచన

  • కొత్త వాల్‌ నిర్మాణానికే జలసంఘం మొగ్గు

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ‘కోర్‌’ నిర్మాణాలన్నీ పటిష్ఠంగానే ఉన్నాయని.. సాంకేతికంగా అన్నీ సక్రమమేనని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్‌ బి పాల్‌.. కెనడా నిపుణులు సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ ప్రాజెక్టు ప్రాంతంలో నాలుగు రోజుల పాటు పర్యటించి.. దెబ్బతిన్న కట్టడాలను అధ్యయనం చేసి.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్‌ కుశ్వీందర్‌ వోహ్రాకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతినలేదని, దాన్ని మరమ్మతు చేయవచ్చని..

ఆ తర్వాత దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాంను నిర్మించవచ్చని చెప్పారు. ఇక కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణకు మరిన్ని పరీక్షలు చేపట్టాలన్నారు. కాఫర్‌ డ్యాం దిగువన లోతుకు నదీగర్భ ఇసుక ఉన్నందున.. కొద్దిపాటి సాంకేతిక చర్యలతో సహజసిద్ధంగానే సీపేజీ తగ్గించేందుకు అవకాశం ఉందని తెలిపారు. వైబ్రో కంపాక్షన్‌ విధానంలో సీపేజీని అడ్డుకోవచ్చన్నారు. ఈ రెండు అంశాలపై తాము వారం, రెండు వారాల్లో ప్రాథమిక నివేదికను అందజేస్తామని స్పష్టం చేశారు.

నివేదిక వచ్చేలోగా కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణ డిజైన్లను సిద్ధం చేసు కుంటే సమయం కలిసి వస్తుందని కేంద్ర జలసంఘం అభిప్రాయపడుతోంది. ఒకవేళ సీపేజీ అధికంగా ఉంటే.. పంపింగ్‌ ద్వారా నీటిని తోడేసే ప్రణాళికా సిద్ధం చేసుకోవచ్చన్నారు. మరోవైపు.. జలసంఘం చైర్మన్‌ వోహ్రా కొత్త డయాఫ్రం వాల్‌ను సమాంతరంగా నిర్మించడమే మేలని బుధవారం నిపుణులతో చర్చల సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే నిపుణులు ఎలాం టి అభిప్రాయమూ వెల్లడించలేదని పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ ఒకరు వెల్లడించారు. జలసంఘం మాత్రం కొత్త వాల్‌ దిశగానే అడుగులు వేస్తోందని చెప్పారు.

Updated Date - Jul 05 , 2024 | 07:55 AM