Share News

YS Jagan: కీలక సమయంలో విదేశాలకు వైఎస్ జగన్.. వ్యూహమేంటో..?

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:43 AM

పార్టీ ఎంపీలు, నేతలు గుడ్‌బై చెబుతున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ వచ్చే నెల 3న సతీసమేతంగా లండన్‌ బయల్దేరుతున్నారు..

YS Jagan: కీలక సమయంలో విదేశాలకు వైఎస్ జగన్.. వ్యూహమేంటో..?

  • 3న లండన్‌కు జగన్‌ దంపతులు

  • 25వ తేదీదాకా అక్కడే

  • కమ్ముకొస్తున్న కేసులు.. జారిపోతున్న ఎంపీలు

  • కీలక సమయంలో మాజీ సీఎం విదేశాలకు

అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పార్టీ ఎంపీలు, నేతలు గుడ్‌బై చెబుతున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వచ్చే నెల 3న సతీసమేతంగా లండన్‌ బయల్దేరుతున్నారు. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడ పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆయనకు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులు ఒకవైపు.. ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు.. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తప్ప మిగతావారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్‌పై వైసీపీ శ్రేణు లు కలవరపడుతున్నాయి. ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకాటంలో పడేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత జగన్‌ వ్యవహార శైలి వారికి అంతుపట్టడం లేదు.

తాడేపల్లిలో కేంద్ర కార్యాలయాన్ని తన ప్యాలెస్‌కు మార్చడం.. తరచూ బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళ్లడం.. ప్రజాతీర్పును గౌరవించకుండా మాట్లాడడం.. కొత్త ప్రభుత్వం కుదురుకోకముందే శాంతిభద్రతల వైఫల్యమం టూ ఢిల్లీలో ధర్నా చేయడం.. పరస్పర దాడుల్లో సొంత పార్టీ కార్యకర్త చనిపోతే టీడీపీపై రుద్దే ప్రయత్నం చేయడం..శవాల కోసం జగన్‌ వెతుకుతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం.. మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు జవాబులివ్వకుండా వెళ్లిపోవడం మొదలైనవి విమర్శలకు తావిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలే గెలుచుకుంది. అయినా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతూ ఏకంగా స్పీకర్‌కే లేఖ రాయడం.. ఆ హోదా రాదని తెలిసీ హైకోర్టును ఆశ్రయించడం.. సీఎంగా ఉన్నప్పటి భద్రతను ఇవ్వాలంటూ పిటిషన్‌ వేయడం.. ఇలాంటివాటి వెనుక జగన్‌ వ్యూహమేంటో వైసీపీ నేతలకు అంతుపట్టడం లేదు. ఆయన తీరు చూసి రాజకీయ ప్రత్యర్థులు నవ్వుకుంటున్నారు. ఇది వైసీపీ శ్రేణులకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో చాలామంది ముఖ్య నేతలు తాడేపల్లి ప్యాలెస్‌ వైపే రావడం లేదు. జగన్‌ కోటరీలో అతిముఖ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటివారు కూడా అటువైపు చూడడం లేదు.

ఎన్డీయేకి ఇక వైసీపీ మద్దతు అక్కర్లేదు..?

లోక్‌సభలో తమకు నలుగురు ఎంపీలే ఉన్నా రాజ్యసభలో 11మంది ఉన్నారని.. మోదీ ప్రభుత్వం ముఖ్యమైన బిల్లుల కోసం తనపై ఆధారపడక తప్పదని జగన్‌ ఇన్నాళ్లూ ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వీరిలో మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా చేసి, టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. వారి బాటలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, గొల్ల బాబూరావు నడవబోతున్నారని.. వారు కూటమి పార్టీలవైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక రాజ్యసభలో ఆ పార్టీకి మిగిలేది వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్‌ రెడ్డి, పరిమళ్‌ నత్వానీ మాత్రమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే సభలో వైసీపీ పాత్ర నామమాత్రం కానుంది. కీలకమైన బిల్లుల ఆమోదానికి ఆ పార్టీపై ఆధారపడాల్సిన అవసరం ఎన్డీయేకి ఉండకపోవచ్చని అంటున్నారు. మరోవైపు జగన్‌ పాలనలో జరిగిన అవినీతిపై చంద్రబాబు సర్కారు కొరడా ఝళిపిస్తోంది. మద్యం, గనులు, ఇసుక వ్యవహారాల్లో ఆయన అడ్డగోలు దోపిడీ, అక్రమాలకు సహకరించిన ఉన్నతాధికారులు, ఐపీఎ్‌సలపైనా కేసులు పడుతున్నాయి. ముంబై నటి వ్యవహారంపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇలా కేసులు తరుముకొస్తుండడం.. పార్టీని నైరాశ్యం ఆవరించిన తరుణంలో జగన్‌ దంపతుల లండన్‌ ప్రయాణం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Updated Date - Aug 30 , 2024 | 09:18 AM