Share News

Amaravati : జగన్‌పై పీసీ యాక్ట్‌?

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:03 AM

సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Amaravati : జగన్‌పై పీసీ యాక్ట్‌?

  • అమెరికా కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన

  • విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చారని చార్జిషీటు

  • న్యాయ సలహా కోరిన కూటమి ప్రభుత్వం

  • గవర్నర్‌ అనుమతి కోరాలన్న యోచన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ అక్కడి కోర్టుల్లో అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలో గౌతమ్‌ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు. 2021లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఉన్నారని చార్జిషీటులో నిర్దిష్టంగా ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. న్యాయ నిపుణుల సలహా ఇందుకు సానుకూలంగా వస్తే జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్టు చేసి విచారణ జరపడానికి గవర్నర్‌ అనుమతి అవసరం. ఈ విషయంపై ఓ మంత్రి మాట్లాడుతూ... ‘రాష్ట్రాన్ని లూఠీ చేసిన వాళ్ల విషయంలో సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. వందల కోట్ల లంచాలు చేతులు మారాయని అమెరికాలో కేసులు నమోదైన తర్వాత చూస్తూ ఎలా ఊరుకొంటాం? అందుకే న్యాయ సలహా తీసుకొంటున్నాం’ అని పేర్కొన్నారు.


తాము దీనిని తేలిగ్గా తీసుకోవడం లేదన్న సంకేతం ప్రజల్లోకి పంపడం కోసం అసెంబ్లీ సమావేశాల్లో కూటమి పార్టీలు తమ సభ్యులతో మాట్లాడించాయి. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు, టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్‌ తదితరులు సౌర విద్యుత్‌ టెండర్ల వ్యవహారం ప్రస్తావిస్తూ జగన్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు సూచనతోనే ఈ చర్చ జరిగింది. తర్వాత ఆయన కూడా సభలో స్పందించారు. అవినీతిని సహించబోమని, అవసరమైన చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఈ వ్యవహారంలో అదానీ పాత్ర ఉండటంతో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా కేంద్రపెద్దలతో మాట్లాడి వారి సూచనల ప్రకారం వెళ్లాలని, జగన్‌ను మాత్రం వదిలిపెట్టరాదని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

  • ఆనాడే టీడీపీ ఫిర్యాదు

జగన్‌ ప్రభుత్వం సెకీ ద్వారా సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొన్నప్పుడే టీడీపీ దీనిపై ధ్వజమెత్తింది. ఆ పార్టీ తరఫున నాటి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ బహిరంగంగా తన వాణిని వినిపించారు. జగన్‌ కుదుర్చుకొన్న ఒప్పందం రాష్ట్రానికి మోయరాని భార ంగా మారుతోందని, తన జేబులు నింపుకోవడానికి ఆయ న ప్రజల జేబులు ఖాళీ చేయిస్తున్నారని కేశవ్‌ అప్పట్లో ఆరోపించారు. ఆయన అంతటితో వదిలి పెట్టకుండా ఈ ఒప్పందంపై కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశారు. మామూలుగా కేంద్ర మండలి రాష్ట్రాల నుంచి రాజకీయ నేతల ఫిర్యాదులను తీసుకోదు. కానీ కేశవ్‌ పదేపదే అభ్యర్థించడంతో ఆయన ఫిర్యాదును స్వీకరించడానికి అంగీకరించింది. దీంతో ఈ ఒప్పందంపై సవివరంగా తమ అభ్యంతరాలతో ఫిర్యాదు దాఖలు చేశారు. కానీ తర్వాత కేంద్ర నియంత్రణ మండలి ఆ ఫిర్యాదును తిరస్కరించింది. దీంతో కేశవ్‌ ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఇదే అంశంపై హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. ఇవి ఇంతవరకూ విచారణకు రాలేదు. ఈ ఒప్పందంపై కేశవ్‌ విమర్శల తర్వా త నాడు విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడారు. ఒప్పందంలో కుదుర్చుకున్నట్లుగా ఒక యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కి రాదని, రాజస్థాన్‌లో తయారైన సౌర విద్యుత్‌ ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి చేరేసరికి ఒక్కోయూనిట్‌కు అదనంగా రూ.1.70 పడుతుం దని ఆయన అంగీకరించారు. సౌర విద్యుత్‌ను దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఒకయూనిట్‌ను రూ.2కు కొనుగోలు చేస్తున్న సమయంలో ఇంతధర పెట్టాలా అన్నప్రశ్న అప్పట్లోనే ప్రతిపక్షాలనుంచి వినిపించింది.


  • ఒప్పందంపైనా పరిశీలన

తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఒప్పందం భవితవ్యం ప్రశ్నగా మారింది. దీనిపైనా ప్రభుత్వం పరిశీలన చేస్తోదని సమాచారం. ‘ఏకపక్షంగా ఒప్పందం రద్దుచేస్తే కోర్టుకు వెళ్తారు. న్యాయ వివాదాలు ఏర్పడతాయి. ఒప్పందాలను గౌరవించడం లేదన్న అభిప్రాయం వెళితే పెట్టుబడిదారుల్లో అపనమ్మకం వస్తుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఒప్పందాన్ని కొనసాగిస్తే ప్రజలపై భారం పడుతుంది. ఏం చేయాలో ఆలోచన చేస్తున్నాం’ అని ప్రభుత్వంలోని ఒక ముఖ్యుడు చెప్పారు.

  • అన్నీ పరిశీలిస్తున్నాం: గొట్టిపాటి

అదానీ, జగన్‌ ముడుపుల వ్యవహారం బయటకు రావడంతో నాడు ఏం జరిగిందన్న దానిపై విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఒప్పంద పత్రాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఇలాంటి అవినీతి వ్యవహారాలకు పాల్పడి, అస్తవ్యస్త విధానాలను సాగించడం వల్లనే ప్రజలపై విద్యుత్‌ భారం పడిందన్నారు. ఈ వ్యవహారాన్ని క్షుణ్నం గా పరిశీలిస్తున్నామని, ఆ తర్వాత అధికారికంగా స్పందిస్తామని రవికుమార్‌ స్పష్టం చేశారు.

Updated Date - Nov 24 , 2024 | 07:13 AM