Share News

‘సరస్వతి’లో అసైన్డ్‌ భూములు వెనక్కి!

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:50 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు రాష్ట్రప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఆయన కుటుంబసభ్యులు సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్‌ భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించడంతో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.

‘సరస్వతి’లో అసైన్డ్‌ భూములు వెనక్కి!
YS Jagan

  • రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • యాజమాన్యం కొన్న భూముల్లో 17.69 ఎకరాలు అసైన్డ్‌

  • అటవీ, రెవెన్యూ అధికారుల గుర్తింపు.. నోటీసులకుస్పందించని రైతులు.. దీంతో వాటి స్వాధీనానికి రంగం సిద్ధం

పిడుగురాళ్ల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు రాష్ట్రప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఆయన కుటుంబసభ్యులు సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో అసైన్డ్‌ భూములు కూడా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించడంతో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ నిర్మాణం పేరిట జగన్‌ కుటుంబసభ్యులు ఉమ్మడి గుంటూరు జిల్లా (ప్రస్తుతం పల్నాడు జిల్లా) మాచవరం మండలం చెన్నాయపాలెం, పిన్నెల్లి, వేమవరం, తంగెడ, ముత్యాలంపాడు గ్రామాల్లో 1,032 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో 956.42 ఎకరాలు పట్టాభూమి కాగా.. 76.33 ఎకరాలు చుక్కల భూమి అని రెవెన్యూ రికార్డులో నమోదైంది. భూములు సేకరించిన ఐదారేళ్లలోపు పరిశ్రమ నిర్మించి.. రైతులకు, భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో నమ్మించారు. కానీ కొనుగోలు చేసి సుమారు 14 ఏళ్లు కావస్తున్నా పరిశ్రమ నిర్మించలేదు. రైతులకు ఉపాధి చూపకపోగా ఆ భూముల్లో ఫ్యాక్టరీ నిర్మించే వరకు పంట సాగుచేసుకుంటామని ముందుకొచ్చినవారిపై 2014లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాంబులు, వేట కొడవళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టిన జగన్‌ ఫ్యాక్టరీ నిర్మించకుండానే నీటి కేటాయింపులు, మైనింగ్‌కు లీజులు మంజూరు చేసుకున్నారు.


డిప్యూటీ సీఎం పవన్‌ రాకతో..

సరస్వతి పవర్‌ భూములపై వివాదం ఏర్పడడంతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గత నెల 4వ తేదీన వాటిని పరిశీలించారు. అంతకు ముందు సంబంధిత రెవెన్యూ అటవీ శాఖల అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి.. 74 ఎకరాల వరకు అటవీ, అసైన్డ్‌ భూమి ఉన్నట్లు తేల్చారు. వేమవరంలో 19 మంది రైతులు 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 13 మంది రైతులు 3.89 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఫ్యాక్టరీకి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు నిర్ధారణ అయింది. అసైన్డ్‌ భూములు ఎలా విక్రయించారని ఆయా రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. వారు స్పందించకపోవడంతో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సరస్వతి యాజమాన్యం సైన్డ్‌ భూమిని ఎలా కొనుగోలు చేసిందో తేలాల్సి ఉంది.

Updated Date - Dec 13 , 2024 | 09:07 AM