Jagan's Mismanagement : సీపేజీ..జగన్ పాపమే!!
ABN , Publish Date - Dec 04 , 2024 | 05:07 AM
ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టును అనాథను చేశారని తేటతెల్లమైంది. ఆయన నిర్వాకం కారణంగానే కాఫర్ డ్యాంల్లో సీపేజీ ఎగదన్నుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020, 2021 వరదల కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని..
పోలవరం స్పిల్‌వే గేట్లు మూయడంతో కాఫర్ డ్యాం మీదుగా వరద ప్రవాహం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టును అనాథను చేశారని తేటతెల్లమైంది. ఆయన నిర్వాకం కారణంగానే కాఫర్ డ్యాంల్లో సీపేజీ ఎగదన్నుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020, 2021 వరదల కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని.. కేంద్ర జలసంఘం, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు భావించాయి. అయితే జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లే నష్టం జరిగిందని నిరుడే వెల్లడైంది. గత ఏడాది డిసెంబరు 5న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నిర్వహించిన సమీక్షలో ఇది బయటపడింది. డ్యాం గేట్ల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకుండా.. వరదలు వచ్చినప్పుడు స్పిల్‌వే గేట్లను మూసివేశారని.. దీంతో వరద జలాలు ప్రధాన డ్యాం వైపు వెళ్లి.. కాఫర్ డ్యాంల పైనుంచి ప్రవహించాయని.. దీనివల్ల ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య భారీగా నిల్వ చేరి.. సీపేజీ ఏర్పడిందని కేంద్ర జలసంఘం, ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సహా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు ఆ సందర్భంగా చెప్పారు. డయాఫ్రం వాల్‌కు కూడా అంతర్గతంగా నష్టం జరిగిందని.. గైడ్‌బంగ్ కుంగిపోయిందని.. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ఇది బయటకు పొక్కలేదని నిపుణులు అంటున్నారు. ఇప్పుడైనా లోతుగా విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. లోపాలు, నష్టాలకు బాధ్యులను గుర్తించకపోవడంతో మరిన్ని అరిష్టాలు జరిగాయని.. డయాఫ్రం వాల్ దెబ్బతినడమే గాక.. కాఫర్ డ్యాంలలో సీపేజీ, గైడ్‌బండ్ కుంగిపోవడం వంటి వాటిని ప్రస్తావిస్తున్నారు.
‘బాధ్యత’పై ఒప్పందమేదీ?
2019 మే నెలాఖరులో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే జగన్ పోలవరం పనులను ఆపేశారు. అప్పటివరకు శరవేగంగా పనులు చేస్తున్న నవయుగ సంస్థపై వ్యక్తిగత కక్షతో దాని కాంట్రాక్టును రద్దుచేశారు. రివర్స్ టెండరింగ్‌లో రూ.1,771 కోట్ల పనులను రూ.1,556 కోట్లకు మేఘా ఇంజనీరింగ్‌కు అప్పగించారు. ఆ వెంటనే.. స్పిల్‌వే, స్పిల్ చానల్, రేడియల్ గేట్లు, డయాఫ్రం వాల్ వంటి పనులు పూర్తయినందున.. వాటి బాధ్యతపై మేఘాతో ఒప్పందం చేసుకోవలసిన జల వనరుల శాఖ.. ఆ దిశగా అడుగులు వేయలేదు. ఫలితంగా డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా.. గైడ్‌బండ్ కుంగిపోయినా.. ఆ నష్టానికి కాంట్రాక్టు సంస్థ బాధ్యత వహించేలా చేయలేకపోయింది. దీంతో ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం అదనంగా రూ.998 కోట్లను కేంద్రమే భరించాల్సి వస్తోంది. అదేవిధంగా గైడ్‌బండ్ కుంగిపోవడంపైనా కాంట్రాక్టు సంస్థను గానీ, అధికారులను గానీ బాధ్యులను చేయకుండా వదిలేశారు. గడచిన ఐదేళ్లలో పోలవరం పనుల్లో ఎంత లేదన్నా రూ.4,500 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. ఇందుకు ఎవరినీ బాధ్యులను చేయకుండా వదిలేయడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాడు నిరంతర పర్యవేక్షణ
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో కీలక కట్టడాల డిజైన్లు, ఆమోదం, పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేది. సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్ఎంఆర్‌ఎస్), రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ), సుప్రీంకోర్టు కేసుల వంటి బాధ్యతలు చూసేందుకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సిబ్బంది ఉండేవారు. ప్రత్యేక పర్యవేక్షణకు అధికారుల బృందాలు ఉండేవి. కానీ 2019-24 నడుమ వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. తాజాగా సమాంతర డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్రం ఆమోద ముద్ర వేసినా.. ఇప్పటిదాకా వాల్ మిక్స్ డిజైన్, స్ట్రక్చరల్ డిజైన్స్ పూర్తి కాలేదు. డిజైన్లే కొలిక్కి రానప్పుడు పనులు ఎప్పుడు మొదలవుతాయని నిపుణులు నిలదీస్తున్నారు. పనులు సత్వరమే పూర్తి చేసేందుకు అందుబాటులో ఉన్న యంత్రాలను పెంచుతారో లేదో స్పష్టత ఇవ్వకపోవడంపై వారిలో అసహనం వ్యక్తమవుతోంది. అన్నిటినీ మించి.. చేసిన పనులపై థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేస్తారో కూడా చెప్పడం లేదు. నాణ్యతా లోపాలకు ఎవరిని బాధ్యులను చేస్తారో కూడా తేల్చడం లేదు. క్వాలిటీ కంట్రోల్ సరిగా లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. పోలవరంలోనూ ఇదే జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీర్ల పూర్వానుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ కూడా ఆక్షేపించిందని.. దీనిని కూడా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. పూర్తిస్థాయిలో ఇంజనీరింగ్ అధికారులను నియమించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పరిస్థితేంటో!
ప్రాజెక్టు స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణం 2028 డిసెంబరుకు మాత్రమే పూర్తవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డ్యాం చాలా ముఖ్యమైన కట్టడమైనందున.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దిగువన ఉన్న ఊళ్లు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాఫర్ డ్యాంలలో సీపేజీ, గైడ్‌బండ్‌లు కుంగిపోవడంపై సమగ్ర విచారణ జరపాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈసీఆర్‌ఎఫ్ డ్యాం విషయంలో కాంట్రాక్టు సంస్థ, అధికారులు అప్రమత్తంగా ఉంటారని అంటున్నారు.