రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Nov 29 , 2024 | 05:28 AM
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి దాఖలు చేసుకున్న ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం కడప జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు (4వ అదనపు జిల్లా కోర్టు) కొట్టివేసింది.
అసభ్య పోస్టుల కేసులో అవినాశ్‌రెడ్డి పీఏ కోసం ముమ్మర గాలింపు
కడప రూరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించిన కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి దాఖలు చేసుకున్న ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గురువారం కడప జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు (4వ అదనపు జిల్లా కోర్టు) కొట్టివేసింది. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనిత, మంద కృష్ణమాదిగ, షర్మిల తదితరులపై వైసీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియా జిల్లా కో-కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డి మరికొందరిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఇదే కేసులో బండి రాఘవరెడ్డి (ఏ-20) నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే వర్రాను పోలీసులు అరెస్టు చేశారు.
అతడు ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. తనకు ముందస్తు బెయిల్ కోరుతూ రాఘవరెడ్డి ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై విచారించిన న్యాయాధికారి దీనబాబు.. తదుపరి ఉత్తర్వుల కోసం 25వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం ఆయన సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జిగా జడ్జిగా వచ్చిన వెంకటేశ్వర రావు (మొదటి అదనపు జిల్లా జడ్జి) ఎదుట 25, 27వ తేదీల్లో విచారణ జరిపారు. రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.