పోలీసైతే ఏంరా... ట్రాక్టర్‌తో తొక్కించేస్తాం
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:16 PM
నువ్వు పోలీసైతే ఏం రా కొడకా... మా ట్రాక్టర్‌కు అడ్డొస్తే తొక్కిచ్చేస్తాం... ఎవరనుకుంటున్నావంటూ ఇసుకాసురులు రెచ్చిపోయారు. ములకలచెరువులో ఇసుకాసురులు బరి తెగించి పోలీసుల మీదే దాడికి తెగబడ్డారు. ఓ హోంగార్డుపై దాడి చేశారు. అడ్డొచ్చిన ఏఎ్‌సఐను పక్కకు నెట్టేశారు.
ములకలచెరువులో బరి తెగించిన ఇసుకాసురులు
హోంగార్డుపై దాడి.. ఏఎ్‌సఐను పక్కకు నెట్టేసిన వైనం
హోంగార్డుకు గాయాలు....కేసు నమోదు...నిందితుల అరెస్టు
ములకలచెరువు, ఆగస్టు 31: నువ్వు పోలీసైతే ఏం రా కొడకా... మా ట్రాక్టర్‌కు అడ్డొస్తే తొక్కిచ్చేస్తాం... ఎవరనుకుంటున్నావంటూ ఇసుకాసురులు రెచ్చిపోయారు. ములకలచెరువులో ఇసుకాసురులు బరి తెగించి పోలీసుల మీదే దాడికి తెగబడ్డారు. ఓ హోంగార్డుపై దాడి చేశారు. అడ్డొచ్చిన ఏఎ్‌సఐను పక్కకు నెట్టేశారు. ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ అమలయ్యే వరకు స్ధానికంగా ఇసుకను తోలకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండలంలో ఇసుక రవాణా ఎక్కడా జరగడం లేదు. ఇదే అదునుగా భావించి శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం బిసినివారిపల్లె నుంచి ఇసుకాసురులు రాత్రి వేళల్లో సరిహద్దులో ఉన్న ములకలచెరువు మండలానికి ఇసుకను ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలోని బిసినివారిపల్లె నుంచి ఓ ట్రాక్టర్ ఇసుకను తీసుకుని మారుమూల మార్గం నుంచి ములకలచెరువు మండలం సోంపల్లెకు వచ్చింది. విధుల్లో భాగంగా అక్కడికి వెళ్లిన ఏఎ్‌సఐ భాస్కర్‌నాయక్, హోంగార్డు సాంబ ఇసుక ట్రాక్టర్‌కు నెంబర్ ప్లేటు లేకపోవడం గమనించారు. దీంతో ఇసుకను ఎక్కడి నుంచి తోలుతున్నారని, ట్రాక్టర్ రికార్డులు, ఇసుక తోలేందుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రికార్డులు, అనుమతి లేకపోవడంతో ఇసుక ట్రాక్టర్‌ను పోలీ్‌సస్టేషన్ వద్దకు తీసుకురావాలని సూచించారు. పోలీ్‌సస్టేషన్ వద్దకు తీసుకెళ్లేందుకు ఇసుక ట్రాక్టర్ వెంట పోలీసులు వచ్చారు. విషయాన్ని డ్రైవర్ జనార్ధన్ ట్రాక్టర్ ఓనర్ శివకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఈ క్రమంలో ఇసుక ట్రాక్టర్ తంబళ్లపల్లె-ములకలచెరువు రోడ్డులోని ములకలచెరువు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు రాగానే శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం బాలసముద్రానికి చెందిన ట్రాక్టర్ యజమాని, టీడీపీ నాయకుడు శివ అక్కడికి చేరుకుని పోలీసుల మీద తిరగబడ్డాడు. నా ట్రాక్టర్‌నే పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్తారా అని రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా పోలీసులైతే ఏంటి అడ్డొస్తే ట్రాక్టర్‌తో తొక్కించేస్తాం అని హోంగార్డు సాంబశివ మీద దాడికి పాల్పడ్డాడు. అలాగే ఏఎ్‌సఐ భాస్కర్‌నాయక్‌ను పక్కకు తోసేశాడు. ఈ దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గాయత్రి వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకోగా అక్కడి నుంచి ట్రాక్టర్ యజమాని శివ పరారయ్యాడు. ఈ ఘటనను పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. దీనిపై రెండు కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డ ట్రాక్టర్ ఓనర్ పి.శివ, ఎలాంటి అనుమతులు, రికార్డులు లేకుండా ఇసుకను తీసుకొస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ జనార్థన్‌పై వేర్వేరు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఏఎ్‌సఐ భాస్కర్‌నాయక్, హోంగార్డు సాంబశివ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గాయత్రి తెలిపారు.